కోనేటి గట్టుపై ప్రేమ జంట ఆత్మహత్య: భార్య చేతులు నరికిన భర్త
నల్గొండ/ ఆదిలాబాద్: నల్లగొండ జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. నల్లగొండ జిల్లాలోని నార్కెట్‌పల్లి మండలం అక్కినపల్లిలో ఈ సంఘటన జరిగింది.
గ్రామంలోని రామాలయం పక్కన ఉన్న కోనేరు వద్ద మంగళవారంనాడు వారు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమికులను నల్లగొండ మండలం దోమలపల్లికి చెందిన రమేష్, ప్రసన్నలుగా గుర్తించారు. రమేష్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, ప్రసన్న ఇంటర్ ఫైనలియర్ చదువుతోంది.
కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దాంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి అక్కినపల్లికి వెళ్లి అక్కడి రామాలయం వద్ద ఉన్న కోనేటి గట్టుపై పురుగుల మందు తాగి మరణించారు. మంగళవారం ఉదయం మృతదేహాలను గుర్తించిన పోలీసులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదిలావుంటే, ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. జిల్లాలోని మంచిర్యాలలో ఓ భర్త తన భార్య చేతులు నరికాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. కుటుంబ కలహాల కారణంగా అతను మంగళవారం ఉదయం ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
బాధితురాలని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్తితి ఆందోళనకరంగా ఉంది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications