"మా" పోలింగ్ ప్రారంభం- ప్రకాశ్ రాజ్ కు మోహన్ బాబు ఆశీర్వాదం : ఓటింగ్ ముందు ఆసక్తికర పరిణామాలు..!!
స్టార్ వార్ అసలైన ఘట్టానికి చేరుకుంది. "మా" ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. నిన్నటి వరకు నువ్వా - నేనా అన్నట్లుగా సాగిన ప్రచార పర్వం ముగిసింది. ఇక, పోలింగ్ ప్రారంభానికి ముందుగా కీలక పరిణామా లు చోటు చేసుకున్నాయి. మోహన్ బాబు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఎదురు పడిన ప్రకాశ్ రాజ్..విష్ణు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకున్నారు. మోహన్ బాబు సమక్షంలో ఇద్దరూ చేతులు కలుపుకున్నారు. ప్రకాశ్ రాజ్ వెంటనే మోహన్ బాబుకు పాదాభివందనం చేసే ప్రయత్నం చేయగా.. ప్రకాశ్ రాజ్ ను వారించిన మోహన్ బాబు..భుజం తట్టి ఆశీర్వదించారు.

పోలింగ్ ఆరంభం..రాత్రికి ఫలితాలు
తాజా-మాజీ అధ్యక్షుడు నరేశ్ సైతం అక్కడే ఉన్నారు. ఇక, రెండు ప్యానళ్ల నుంచి పోటీ చేస్తున్న సభ్యులు సైతం పోలింగ్ సాధ్యమైనంత ఎక్కువ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. గతం కంటే ఈ సారి "మా" ఎన్నికల్లో పోలింగ్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. మధ్నాహ్నం 2 గంటల వరకు పోలింగ్ సాగనుంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. రాత్రి పది గంటల సమయానికి తుది ఫలితం వస్తుందని అంచనా వేస్తున్నారు.

సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మోహన్ బాబు
ఇప్పటి దాకా వ్యక్తిగతంగా ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటూ సాగిన ప్రచార పర్వం వేడి..ఈ ఎన్నికలతో పూర్తిగా తగ్గిపోతుందని "మా" పెద్దలు చెబుతున్నారు. పోలింగ్ పూర్తయి..ఫలితాలు వచ్చిన తరువాత ఎవరు గెలిచినా..అందరం కలిసి పని చేస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న "మా" సభ్యులు 60 ఏళ్లు దాటిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ కు అవకాశం కల్పించారు. తొలుత ఈవీఎం ల ద్వారా పోలింగ్ జరపాలని అనుకున్నా..ఆ తరువాత బ్యాలెట్ పేపర్ల మీద పోలింగ్ కు నిర్ణయించారు.

తరలి వస్తున్న స్టార్స్... కొనసాగుతున్న ఉత్కంఠ
పోలింగ్ జరిగే జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ వద్ద ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేసారు. ఇక, చివరగా విష్ణు వీడియో మెసేజ్.. మోహన్ బాబు ఆడిమో మెసేజ్ ల ద్వారా తమ వాదన వినిపించే ప్రయత్నం చేసారు. "మా" పోలింగ్ ముందు మోహన్ బాబు అక్కడ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ పోలింగ్ ప్రారంభం అయింది. ఈ సాయంత్రం నుంచి అందరం కలిసి యాక్టర్లు గానే కలిసి మెలిసి ఉంటామని ఎన్నికల్లో నిలిచిన అభ్యర్ధులే స్వయంగా చెబుతున్నారు. మా'లో మొత్తం 925 మంది సభ్యులు ఉన్నారు. అయితే వీరిలో 883 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి చివరికి ఎంతమంది పోలింగ్ కేంద్రానికి వస్తారో చూడాలి. పోసాని సైతం తన ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.

మోహన్ బాబు- చిరంజీవి మంచి ఫ్రెండ్స్ : పవన్ కళ్యాణ్
ఓటు వేసేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాను చాలా సార్లు ఓటు వేసాను కానీ, ఇటువంటి పరిస్థితులు చూడలేదన్నారు. మా ఎన్నికల కోసం ఇంతలా వ్యక్తిగత దూషణలు అవసరం లేదని పవన్ అభిప్రాయపడ్డారు. సినిమా ఇండస్ట్రీ విడిపోవటం జరగదని తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీలే ఒకరి సహకారం మరొకరు కలిసి పోటీ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వ్యక్తులు చేసేది మొత్తం ఇండస్ట్రీకి అంట కట్టటం సరి కాదన్నారు. ఇక, చిరంజీవి- మోహన్ బాబు మంచి ఫ్రెండ్స్ అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వ్యక్తులు చేసేది..సినిమా రంగానికి అంటదని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications