మహబూబాబాద్‌లో దారుణం-గిరిజన బాలికపై హత్యాచారం-గుట్టల్లో శవమై తేలిన బాలిక
మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ గిరిజన బాలిక హత్యాచారానికి గురైంది. కిరాణా దుకాణానికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన బాలిక... గ్రామానికి సమీపంలో ఉన్న గుట్టల్లో శవమై తేలింది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆ బాలికను తండ్రి అపురూపంగా చూసుకుంటున్నాడు. అలాంటిది ఆమె శవమై కనిపించడంతో ఆయన గుండెలవిసేలా రోధించాడు. గ్రామానికి చెందిన ఓ యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు.

అసలేం జరిగింది...
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండా ధర్మారం గ్రామ శివారులోని సీతారాం తండాకు చెందిన ఓ బాలిక ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఆ తల్లిదండ్రులకు మొత్తం నలుగురు ఆడపిల్లలు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో ఆలనా పాలనా అంతా తండ్రే చూసుకుంటున్నాడు. తండ్రికి చేదోడు వాదోడుగా కూతుళ్లు కూడా ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్తున్నారు. రోజూ లాగే ఉపాధి కూలీ పనులకు వెళ్లి వచ్చాక... ఇంటర్ చదువుతున్న బాలిక(17) కిరాణ దుకాణానికి వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది.

కన్నీరుమున్నీరుగా విలపించిన తండ్రి
ఆ తర్వాత గంట సేపటికి.. గ్రామ సమీపంలోని గుట్టల్లో ఆ బాలిక అచేతనంగా పడి ఉన్నట్లు వారి బంధువు ఒకరు ఇంటికి వచ్చి చెప్పారు. విద్యుత్ సబ్ స్టేషన్‌లో పనిచేసే బాలిక తండ్రికి కూడా ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతా కలిసి గుట్టల్లోకి వెళ్లి చూడగా బాలిక రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. కూతురు మృతదేహాన్ని చూసి ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. కన్నీరుమున్నీరుగా విలపించాడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో నలుగురు ఆడపిల్లలను అపురూపంగా చూసుకుంటున్నానని వాపోయాడు. ధర్మారం గ్రామానికి చెందిన ధరమ్ సోతు రాజేష్ అనే యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
Recommended Video

మంత్రి సత్యవతి రాథోడ్,ఎంపీ కవిత రియాక్షన్
రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించిన మంత్రి... నేరస్తుడిని వెంటనే పట్టుకుని కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. పేదరికం నుంచి వచ్చి ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న బాలిక పట్ల ఇలాంటి దారుణం జరగడం క్షమించరానిదని అన్నారు. అమ్మాయి తండ్రితోనూ ఫోన్‌లో మాట్లాడి ఓదార్చారు. కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎంపీ మాలోతు కవిత కూడా ఈ ఘటనపై స్పందించారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలిక మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టమ్ నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications