సొంతూరు వాళ్లని నమ్మితే.. యువతిపై దారుణం: ఐదుగురి అరెస్ట్
మహబూబ్ నగర్: కుడికల్లకు చెందిన వివాహిత వర్షిణి ఆత్మహత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సొంతూరి వాళ్లు కదా అని నమ్మితే, ఆమె పైన అత్యాచారం చేశారని తెలుస్తోంది. దానిని భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది.
మహబూబ్ నగర్ జిల్లా కుడికల్లకు చెందిన వర్షిణిని అదే గ్రామానికి చెందిన స్వామి ఈ నెల 24వ తేదీన తన బైక్ పైన కొల్లాపూర్ నుంచి కుడికిల్లకు తీసుకు వచ్చాడు. గంటన్నర ఆలస్యంగా రాత్రివేళ ఇంటికి వెళ్లిన వర్షిణి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆమె రాఖీ కట్టేందుకు వెళ్లి, తిరిగి గ్రామానికి వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమెను బైక్ పైన తీసుకు వచ్చిన వ్యక్తి, మరో నలుగురు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారని తేలిందని తెలుస్తోంది. ఊరివాళ్లు కదా అని నమ్మి వారి వెంట వస్తే అఘాయిత్యానికి పాల్పడ్డారు.
కాగా, పోలీసులు కేసును విచారిస్తున్నారు. కొల్లాపూర్ నుంచి చుక్కాయిపల్లి మీదుగా కుడికిల్లకు వెళ్లిన సమయంలో మధ్యలో ఏమి జరిగింది, ఎవరెవరు ఉన్నారు.. తదితర కోణంలో పోలీసులు విచారణ జరిపారు. స్వామితో పాటు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
వర్షిణి ఆత్మహత్యపై కుడికిల్ల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. వర్షిణి చావుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. వర్షిణి మృతి పైన సిఐడితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications