మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు తీసుకువచ్చింది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలేనని ఆ రిజర్వేషన్లను రద్దుచేసి ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లను తీసుకువస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సిద్ధిపేటలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కు మద్దతుగా నిర్వహించిన బిజెపి విశాల జనసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయి
అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని చేయడం కాంగ్రెస్ కు ఇష్టం లేదని రామ మందిరం నిర్మించకుండా కాంగ్రెస్ కేసులు వేసిందని అమిత్ షా పేర్కొన్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి ప్రాణ ప్రతిష్ట చాలా ఘనంగా జరుపుకున్నామన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అక్రమాలు చూశామని, రెండు పార్టీలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయని అన్నారు.

కాంగ్రెస్ తెలంగాణాను ఢిల్లీకి ఏటీఎంలా మార్చింది
గతంలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఏటీఎం లా వాడుకుంటే, అవినీతికి పాల్పడితే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారని ఆరోపించారు. మోదీ తెలంగాణను అవినీతిపరుల నుంచి విముక్తి కల్పించేందుకు పనిచేస్తున్నారన్నారు .రాష్ట్రంలో 12 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించాలని, కమల వికాసం తెలంగాణలో జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
మళ్ళీ మోదీని ప్రధానిని చెయ్యండి
మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేయాలన్నారు. దేశంలో 400 కు పైగా స్థానాల్లో బీజేపీని గెలిపించాలని, మోదీని మరోసారి ప్రధానిని చేయాలని అమిత్ షా కోరారు. జమ్ము కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను తొలగించామని పేర్కొన్న అమిత్ షా కశ్మీర్‌ను భారత్‌లో శాశ్వతంగా అంతర్భాగం చేసేందుకు మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు.
తెలంగాణా విమోచనా దినోత్సవం అధికారికంగా
మజ్లిస్‌కు భయపడే బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించట్లేదని పేర్కొన్నారు .బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని గుర్తు చేశారు. మరోసారి మోదీ ప్రధాని అయితే.. తెలంగాణను అవినీతిపరుల నుంచి విముక్తి కల్పిస్తారన్నారు. సమగ్ర తెలంగాణ వికాసం బిజెపి తోనే సాధ్యమన్నారు.












Click it and Unblock the Notifications