అనుమానం: రోడ్డు మీదికి ఈడ్చి రాయితో కొట్టి భార్యను చంపేశాడు
నేరేడ్‌మెట్: భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి రాయితో కొట్టి చంపాడు. ఈ దారుణ సంఘటన సికింద్రాబాదులోని నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
తూర్పు గోదావరి జిల్లా పెడమర్తికి చెందిన గణేశ్‌కు 2001లో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన వరలక్ష్మి(33)తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు శిరీష(14), సందీప్‌కుమార్(12) ఉన్నారు. మౌలాలి సమీపంలోని ప్రగతినగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. గణేశ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
వరలక్ష్మి ఓ షాపులో పనిచేస్తోంది కొంత కాలంగా మద్యానికి బానిసైన గణేష్ పనిచేయడం మానేశాడు. డబ్బుల కోసం భార్యను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో భార్యకు ఎవరితోనో వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. రోజూ తాగొచ్చి ఆమెతో గొడవపడేవాడు.

మంగళవారం అర్ధరాత్రి తాగి వచ్చిన గణేశ్ భార్యతో ఘర్షణపడ్డాడు. జుట్టు పట్టుకొని రోడ్డుపైకి తీసుకొచ్చి బండరాయితో కొట్టి చంపేశాడు. నేరేడ్‌మెట్ పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ మార్చూరికి తరలించారు. గణేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు.
నిప్పంటించుకున్న మహిళ
ఓ మహిళ హైదరాబాదులోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ ఎదుట నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కేపీహెచ్‌బీ కాలనీ సీఐ శ్రీకాంత్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం - ఆల్విన్‌కాలనీ ఎల్లమ్మబండలోని శివయ్యబస్తీలో కె.పద్మ(45), కామేశ్వరి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు.
తల్లి తమను ఇంట్లోకి రానివ్వ కుండా ఇబ్బంది పెడుతోందని కూతుర్లు, తన కుమార్తెలు తన మాట వినడం లేదని తల్లి పద్మల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి పద్మ కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో కూతుర్లపై ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. పద్మ వెంట కూతుర్లు కూడా వచ్చారు.
పద్మ చెప్పిన వివరాలను విన్న పోలీసులు, మీరు నివాసముండే కాలనీ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుందంటూ.. అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ బయట రోడ్డుపై కొద్దిసేపు తల్లీ కూతుర్లు వాదనలు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంతలో పద్మ సమీపంలోని బంక్ నుంచి తెచ్చుకున్న పెట్రోలు పోసుకొని నిప్పంటించుకుంది. స్థానికులు, పోలీసులు వెంటనే మంటలు ఆర్పి బాధితురాలిని గాంధీ వైద్యశాలకు తరలించారు. కుటుంబ తగాదాల వల్లే పద్మ ఆత్మహత్యకు యత్నించిందని, వేరే కారణాలు లేవని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications