మిత్రుడి బిడ్డపై లైంగిక దాడి: ఇలా వచ్చి చోరీ
హైదరాబాదు: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి మిత్రుడి కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 9 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిని సికింద్రాబాదులోని కార్ఖానా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఎస్‌ఐ సునీల్ తెలిపిన వివరాల ప్రకారం - మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన మరోటి థెజీరావు (31) ఓల్డ్ మడ్‌పోర్టులో టీ అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. సాయంత్రం స్నేహితుడి ఇంటికి వచ్చాడు.
అతని కూతురు (9) ఒంటరిగా ఉండటాన్ని గమనించి తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో కార్ఖానా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై కేసు చేసి రిమాండ్‌కు తరలించారు.
పాత పేపర్లు కొనడానికి వచ్చి చోరీ

పాత న్యూస్‌పేపర్లు కొనేందుకు వచ్చి ఓ ఇంట్లో నుంచి బంగారాన్ని దొంగిలించిన వ్యక్తిని హైదరాబాదు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అదనపు డీసీపీ కోటిరెడ్డి కథనం ప్రకారం - మహబూబ్‌నగర్ జిల్లా మడ్గూల్ మండలం సంత్రాలగడ్డ తండాకు చెందిన రత్లావత్ నరేష్ నాయక్ జీవనోపాధి కోసం నగరానికి వచ్చి ఫలక్‌నుమా, రవీంద్రనాయక్ కాలనీలో నివాసముంటున్నాడు.
పాత ఇనుప సామగ్రి, పాత పేపర్లు సేకరిస్తుంటాడు. గత నెల 8న మొగల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని గౌలిపురాలో నివాసముండే మనోజ్‌కుమార్ గోయల్ ఇంటికి పాత పేపర్లు కొనడానికి వెళ్లాడు. పాత పేపర్లు తీసుకొని వెళ్లిపోయిన తరువాత వారి ఇంట్లో కప్‌బోర్డులో దాచిన 70 తులాల బంగారు, ఎనిమిది తులాల వెండి ఆభరణాల పెట్టే కన్పించలేదు. ఇంట్లో అంతా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నరేష్ నాయక్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేయడంతో టాస్క్‌ఫోర్స్ అతనిపై దృష్టి పెట్టింది. కానిస్టేబుల్ ఎ.లక్ష్మణ్‌రావు నిందితుడికి సంబంధించిన ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నరేష్‌నాయక్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద సొత్తు రికవరీ చేశారు. తదుపరి విచారణ కోసం మొగల్‌పురా పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు.












Click it and Unblock the Notifications