IAS: ఏపీ వద్దు.. తెలంగాణే ముద్దు అంటున్న ఐఏఎస్ లు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన సమయంలో కేంద్రం ఇరు రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్ లను కేటాయించింది. అయితే ఏపీకి కేటాయించిన కొంత మంది తెలంగాణలోనే సర్వీస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ కేడర్ కు చెందిన 11 మంది తెలంగాణలో కొనసాగుతూన్నారు. వీరిని వెంటనే ఏపీ సీఎస్ కు రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సీఎస్ లకు లేఖలు కూడా రాసింది. ఈ 11 మందిలో జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, రోనాల్డ్ రోస్ తో పాటు పలువురు ఐఏఎస్ లు ఉన్నారు. వీరిందరికీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ సెంటర్ (డీఓపీటీ) ఏపీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
వీరందరూ డీఓపీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)కు వెళ్లారు. అమ్రపాలి, వాకాటి కరుణ, సృజన, వాణి ప్రసాద్ వేర్వేరుగా క్యాట్‌లో పిటిషన్లు వేశారు. డీఓపీటీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని వారు పిటిషన్ లో పేర్కొన్నారు. తమను తెలంగాణలోనే కొనసాగించాలని కోరారు. వీరి పిటిషన్లపై అక్టోబర్ 15న క్యాట్ విచారణ చేపట్టే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం వీరంతా తమను తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. వీరి విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఏపీలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది.

అయితే ఈ 11 మంది ఐఏఎస్ లు ఇక్కడే పని చేసేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ లేఖ రాసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 11 మందిలో కీలక విభాగాల్లో పని చేస్తున్నారు. వీరిని వెంటనే రిలీవ్ చేయడం వల్ల పాలనకు సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొద్ది సమయం ఇవ్వాలని లేఖలో కోరే అవకాశం ఉంది. ఒకవేళ కేంద్రం తెలంగాణ విజ్ఞప్తిని తిరస్కరిస్తే ఏపీకి కూడా లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా ఏపీలో పని చేస్తున్న తెలంగాణ కేడర్ కు చెందిన ఐదుగురు ఐఏఎస్ లను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అనంతరాము, ఎస్ఎస్ రావత్, హరికిరణ్, సృజన, శివశంకర్ ఏపీలో ఉంటామని చెప్పినా కేంద్రం వారి విజ్ఞప్తిని ఒప్పుకోలేదు. దీంతో వారిని ఏపీ రిలీవ్ చేసింది.












Click it and Unblock the Notifications