ఐలయ్యకు మద్దతు.. కుట్ర!, బాబు 'నిషేధిస్తే' ప్రమాదకరం: జగన్ ప్రకటన
కంచ ఐలయ్యకు అన్నిరకాలుగా మద్దతు ఇస్తామని, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఆయనకు అండగా నిలబడాలని జగన్ ప్రకటనలో కోరారు.
హైదరాబాద్: సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు మావోయిస్టు పార్టీ అండగా నిలిచింది. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకంపై వివాదం నేపథ్యంలో.. ఆయనకు వస్తున్న బెదిరింపులను పార్టీ ఖండించింది.
ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికారిక ప్రతినిధి జగన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కంచ ఐలయ్యకు అన్నిరకాలుగా మద్దతు ఇస్తామని, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఆయనకు అండగా నిలబడాలని జగన్ ప్రకటనలో కోరారు.

సంఘ్ పరివార్ హత్యా రాజకీయాల్లో భాగమే:
గౌరీ లంకేశ్ హత్య, కంచ ఐలయ్యపై దాడులు సంఘ్ పరివార్ హత్యా రాజకీయాల్లో భాగమేనని మావోయిస్టు పార్టీ అభిప్రాయపడింది. మూఢవిశ్వాసాలు, అశాస్త్రీయ భావాలను ప్రశ్నించే హేతువాదులను ఆర్ఎస్ఎస్ చంపుతోందన్నారు.

కుట్రం దాగుంది:
బ్రాహ్మణీయ హిందూ మతోన్మాదంపై గళమెత్తినందుకే గౌరీ లంకేష్ ను ఆర్ఎస్ఎస్ హత్య చేసిందని, ఇప్పుడు వైశ్యులను కించపరచాడని చెబుతూ ఐలయ్య భావ ప్రకటన స్వేచ్చపై దాడి జరుగుతోందని మావోయిస్టు పార్టీ పేర్కొంది. దీని వెనకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర దాగుందని చెప్పుకొచ్చింది.

ఆ హక్కు ఎవరికీ లేదు:
ఐలయ్యతో రాజకీయ భేధాభిప్రాయాలున్నా కూడా ఆయన భావప్రకటన స్వేచ్చను తాము గౌరవిస్తున్నామని మావోయిస్టు పార్టీ తెలిపింది. ఆయన భావప్రకటన స్వేచ్చను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని గుర్తుచేసింది.
సంఘ్ పరివార్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు విధానాలు అమలు చేస్తోందని ఆరోపించింది. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం అట్టడుగు వర్గాల ప్రజలపై దాడులు చేస్తోందని పేర్కొంది.

మోడీ, కేసీఆర్, బాబులపై:
మోడీ, కేసీఆర్ తమ వర్గాన్ని ప్రశ్నించడాన్ని, విమర్శించడాన్ని సహించలేక పోతున్నారని, అందుకే వీరి నియంతృత్వ పాలనలో కంచ ఐలయ్యను చంపుతాం, నాలుక కోస్తామన్న బెదిరింపులు వినిపిస్తున్నాయని చెప్పుకొచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు ఏకంగా ఐలయ్య పుస్తకమే లేకుండా చేస్తానంటున్నాడని. అక్షరాల్ని నిషేధించాలనుకునే నియంతృత్వం చాలా ప్రమాదకరం అని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications