మావోల అలజడి: వాహనాలకు నిప్పు, ప్రభుత్వ విధానాలపై మండిపాటు
సరిహద్దుల్లో మావోయిస్టులు మళ్లీ తమ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.
భద్రాచలం: సరిహద్దుల్లో మావోయిస్టులు మళ్లీ తమ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం రాత్రి మణుగూరు ఏరియా పేరిట లేఖలు విడుదల చేసిన మావోలు.. ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. కార్పొరేట్ కంపెనీలకు ప్రజలను ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ఆ లేఖలో పేర్కొన్నారు.
హరితహారం పేరుతో గిరిజనుల సాగులో ఉన్న భూములను లాక్కున్నందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో విధ్వంసం సృష్టించారు. ఆ ప్రాంతంలోని తాళ్లగూడెం మండలం అన్నారం వద్ద నేషనల్ హైవే పనులకు వినియోగిస్తున్న 8 ట్రాక్టర్లు, నాలుగుటిప్పర్లకు మావోయిస్టులు నిప్పుపెట్టి ధ్వంసం చేశారు. లేఖలు విడుదల చేసిన కొన్ని గంటల్లోనే వాహనాలకు నిప్పు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

తెరమీదకు మణుగూరు ఏరియా కమిటీ
జిల్లాల విభజన అనంతరం మావోయిస్టులు సైతం విభజన బాట పట్టినట్లుగా తెలుస్తోంది. భద్రాచలం డివిజన్‌లో వెంకాపురం ఏరియా కమిటీ విస్తృతంగా పనిచేసింది. ఈ కమిటీ పేరుతో గోదావరికి ఇరువైపులా కార్యకలాపాలు సాగించేవారు. ఆ తర్వాత శబరి ఏరియా కమిటీ తెరమీదికి వచ్చింది. ఈ కమిటీ పేరుతో విధ్వంసకర సంఘటనలకు పాల్పడిన మావోయిస్టులు తమదైన శైలిలో ఉనికిని చాటుకున్నారు.
గత కొద్దికాలం క్రితం చర్ల ఏరియా కమిటీ పేరు వినిపించినప్పటికీ ఇప్పుడు పెద్దగా ప్రచారంలో లేదు. తాజాగా మళ్లీ మణుగూరు ఏరియా కమిటీ బయటకు వచ్చింది. మణుగూరు ఏరియా కమిటీ పేరిట మావోయిస్టులు గతంలో కార్యకలాపాలు సాగించినట్లు తెలుస్తోంది. జిల్లాల విభజన తర్వాత వెంకటాపురం, చర్ల ఏరియా కమిటీల ప్రాంతాల్లోని గ్రామాలు భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లడంతో మావోయిస్టులు సైతం కమిటీలను బలోపేతం చేసుకునే దిశలో పడినట్లు సమాచారం. మణుగూరు ఏరియా కమిటీ పేరిట లేఖ విడుదల చేశారనే వార్తలు వినవస్తున్నాయి.












Click it and Unblock the Notifications