వారివల్లే నంబాల పట్టుబడ్డారు; పాకిస్తాన్ కంటే మేమే ఘోరమా? మావోల సంచలన లేఖ!
మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుడు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఆయన ఎన్కౌంటర్ తర్వాత ప్రస్తుతం అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మావోయిస్టులు రాసిన సంచలన లేఖలో ఆయనను సజీవంగానే పట్టుకుని కాల్చి చంపినట్టు పేర్కొన్నారు. ఆయన పట్టుబడటానికి కారణమైన వారి గురించి లేఖలో సంచలన అంశాలను వెల్లడించారు.
నంబాల కేశవరావు ఎన్కౌంటర్ పై, మావోయిస్టుల లేఖ
మావోయిస్టు పార్టీ ప్రధానకార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ బీఆర్ దాదాను పోలీసులు సజీవంగానే పట్టుకుని కాల్చిచంపినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది.ఈ మేరకు మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఒక ప్రకటన విడుదల చేశారు. లొంగిపోయిన కొందరు ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఛత్తీస్ఘడ్ -నారాయణపూర్, అబూజ్మడ్ ప్రాంతంలో ఈనెల 21న జరిగిన ఎన్ కౌంటర్లో విజయం సాధించగల్గినట్టు పేర్కొన్నారు.

19నుంచి 21వరకు భీకరపోరు
నంబాల సహా ఈ ఎన్ కౌంటర్ లో మొత్తం 27మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. ఈనెల 19నుంచి 21వరకు భీకరపోరు జరిగింది. మావైపు 35మంది, 25 వేల మంది భద్రతా బలగాలున్నాయని మమ్ముల్ని 60 గంటలు చుట్టుముట్టి నిర్బంధించారన్నారు. 10గంటల్లో 5 ఎన్కౌంటర్లు జరిగాయన్నారు. నంబాలను కాపాడుకునేందుకు 27 మంది నాయకులు ప్రాణ త్యాగం చేసినా ఆయనను మేం కాపాడుకోలేకపోయామన్నారు.
లొంగిపోయిన విప్లవ ద్రోహుల వల్లే ఈ ఎన్కౌంటర్
ఈ ఎన్ కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మరణించారని, ఒక మృతదేహాన్ని మేం వెంట తీసుకెళ్లామని మరో ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారని ఆ లేఖలో వికల్ప్ పేర్కొన్నారు.
లొంగిపోయిన విప్లవ ద్రోహుల వల్లే ఈ ఎన్కౌంటర్ జరిగిందని, నంబాల రక్షణ దళంలోని ఆరుగురు కీలక వ్యక్తులు పోలీసులకు సహకరించడం వల్లే ఆయన ఉన్న ప్రాంతానికి డీఆర్జీ, ఇతర బలగాలు సులభంగా చేరుకున్నాయని, దేశచరిత్రలోనే మే 21 చీకటి రోజుని పేర్కొన్నారు.
షాహిద్ సంస్మరణ సభలకు మావోల పిలుపు
నంబాల ఉన్నట్లు బలగాలు, నిఘావర్గాలకు ఆర్నెల్ల ముందే తెలుసునని, పోలీసులు ఆయనను చేరుకోవడానికి లొంగిపోయిన నక్సల్స్ సహకరించారని పేర్కొన్నారు. ఈ ఎన్ కౌంటర్ కు నిరసనగా.. అమరవీరులను స్మరించుకుంటూ..'షాహిద్ సంస్మరణ సభలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. మొదట్లో నంబాలకు 60 మందితో పటిష్ఠ భద్రత ఉండేదని ఆపరేషన్ కగార్ తర్వాత పరిస్థితుల్లో భద్రత 35కు కుదించినట్లు పేర్కొన్నారు.
ఆ ద్రోహులే నంబాల సమాచారం ఇచ్చారు
పలువురు పోలీసుల ఎదుట లొంగిపోయారని, అలా లొంగిపోయిన వారిలో ఆరుగురు ద్రోహులు, యూనిఫైడ్ కమాండ్ సభ్యుడు పోలీసులకు నంబాల సమాచారమిచ్చారని పేర్కొన్నారు. నిజానికి 17నే బలగాలు చుట్టుముట్టాయని అదే రోజు పీపీసీ కమిటీ సభ్యుడొకరు తన జీవిత సహచరితో కలిసి పారిపోవడంతో కుట్ర జరిగిందని, తమకు అర్థమై వెంటనే శిబిరం మార్చినా. 19న బలగాలు తమదాకా వచ్చాయని పేర్కొన్నారు.
శాంతి చర్చల విషయంలో ఎందుకీ మౌనం
షెల్టర్ జోన్ కు వెళ్లాలని కోరినా నంబాల అంగీకరించలేదని, నిరాకరించారని పేర్కొన్నారు. పైగా తను ఈ బాధ్యతను రెండు మూడేళ్లు మాత్రమే చూడగలనని అందుకే తన గురించి ఆలోచించకుండా భవిష్యత్తులో పార్టీని నడిపించాల్సిన యువ నాయకత్వం భద్రతపై శ్రద్ధ పెట్టాలని సూచించినట్టు పేర్కొన్నారు. యువ నాయకత్వాన్ని కాపాడుకోవాలని ముందు నిలిచిన ఆయనను కాపాడుకోవడంలో మేం విఫలమయ్యామని పేర్కొన్నారు. తాము శాంతి చర్చలు ప్రతిపాదించినా.. కేంద్రం సిద్ధంగా లేదని పేర్కొన్నారు. దాయాది పాకిస్తాన్ కోరితే కాల్పులు విరమణకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం , తమతో విముఖతకు కారణం ఏమిటని వికల్ప్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications