మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వెనుక కుట్ర: కేసు నమోదు; రంగంలోకి ప్రత్యేకబృందాలు!!
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై మహదేవపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో పిల్లర్ కుంగిపోవడం వెనుక కుట్రకోణం ఉందన్న అనుమానం మొదట వ్యక్తంచేసిన అధికారులు ఈ మేరకు, దీనిపై దర్యాప్తు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఎవరో ఉద్దేశపూర్వకంగానే కుట్ర కోణంలో భాగంగా పేలుడు పదార్థం పెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసాంఘిక శక్తులు ప్రభుత్వానికి చెందిన ఈ బ్యారేజీకి నష్టం కలిగించారని ఘటన జరిగిన సమయంలో డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికాంత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించ వలసిందిగా పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడం కోసం చేసిన కుట్రగా దీనిని అనుమానిస్తున్నారు. అందుకే ఈ మేరకు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ౩,4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు ఈ కేసుపై విచారణ చేయడానికి ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు
ఆదివారం నాడు మహాదేవపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు ఆయన రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో పై అనుమానాన్ని వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీపై భారీ శబ్దం వచ్చేంతవరకు రాకపోకలు బాగానే జరిగాయి అని, సరిగ్గా శనివారం సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు భారీ శబ్దం వచ్చిందని దీంతో ఎల్ అండ్ టి సంస్థకు చెందిన ఫోర్ మ్యాన్ తో కలిసి ఘటన స్థలానికి వెళ్లి చూసామన్నారు.
19 నుండి 21 పిల్లర్ల మధ్య బ్యారేజీ కుంగి పోయినట్లుగా గుర్తించామని తెలిపారు. ఇక ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సెక్షన్ 427, పబ్లిక్ ప్రాపర్టీ విధ్వంస నిరోధక చట్టంలోని సెక్షన్ 3 కింద నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications