సంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం... ఎగిసిపడ్డ అగ్ని కీలలు... భయంతో స్థానికుల పరుగులు
సంగారెడ్డి జిల్లా జిన్నారంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గడ్డ పోతారం పారిశ్రామికవాడలోని సరాక లేబొరేటరీస్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదాన్ని గుర్తించే లోపే.. భారీ ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.దీంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు.
అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించడంతో... హుటాహుటిన ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద సమయంలో లోపల కార్మికులు ఉన్నారా... ప్రాణనష్టం జరిగిందా వంటి వివరాలేవీ ఇంకా తెలియరాలేదు.

రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆర్ట్ ల్యాబ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటనలో పారిశుద్ధ్య కార్మికురాలు యశోద(40) సజీవ దహనమయ్యారు. మరో మహిళ స్వల్పంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ సాయంతో మంటలు ఆర్పిన తర్వాత యశోద మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు.
వారం రోజుల క్రితం హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గాంధీనగర్ పారిశ్రామికవాడలోనూ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ప్రేరణి ఇండస్ట్రీస్ ప్లైవుడ్ గోదాములో మంటలు చెలరేగాయి. ఇండస్ట్రీ నిర్వాహకులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కొద్ది గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా గోదాములో ఉన్న కర్రలు అంటుకోవడంతో మంటలు వ్యాపించినట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications