రాబోయేరోజుల్లో మహమ్మారి.. రంగంలో స్వర్ణలత భవిష్యవాణి!
ఉజ్జయిని మహంకాళి బోనాలలో భాగంగా ఈరోజు రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. బోనాల పండుగ తర్వాత రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండ పైన నిలబడి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. ఈ సంవత్సరం కూడా బాగా వర్షాలు కురుస్తాయని, తాను కోపంగా లేనని తెలిపారు. ఒకవేళ తాను కన్నెర్ర చేస్తే రక్తం కక్కుకుంటారు అంటూ స్వర్ణలత పేర్కొన్నారు.
నా మాటలు లెక్క చేయడం లేదని మాతంగి ఆగ్రహం
ఈ సంవత్సరం నా భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నానని, అయినప్పటికీ ఎన్నిసార్లు చెప్పినా ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉన్నారని మాతంగి స్వర్ణలత తెలిపారు. నేను చెప్పిన మాటలు లెక్క చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం నా కోరిక చెప్పినా నెరవేర్చడం లేదని, నాకు సక్రమంగా పూజలు చేసి విధి విధానాలతో నన్ను కొలవాలని అమ్మవారి మాటగా మాతంగి స్వర్ణలత ఆజ్ఞాపించారు.

అందరూ జాగ్రత్తగా ఉండాలన్న మాతంగి స్వర్ణలత
దీంతో తల్లీ ఆగ్రహం వద్దంటూ, సక్రమంగా పూజలు జరిపిస్తాం అంటూ అమ్మవారికి ఆలయ పూజారులు మాటిచ్చారు. ఇక నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని కాపాడతానని, అందరికీ తోడుగా నిలబడతానని రాబోయేరోజుల్లో మహమ్మారి వెంటాడుతుంది. అందరూ జాగ్రత్తగా ఉండాలని మాతంగి స్వర్ణలత తెలిపారు. అగ్నిప్రమాదాలు జరుగుతాయని ముందే హెచ్చరిస్తున్నాం అన్నారు. పాడిపంటలు సమృద్ధిగా చూసుకునే భారం తనదని భక్తులంతా ఐదువారాలు పప్పు, ఫలహారంతో కడివెడు సాక పోసి తనను సంతోష పెట్టాలన్నారు.
ఉజ్జయిని మహంకాళి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు
మీరు కోరిందల్లా కొంగుబంగారం చేసే మహంకాళిని నేను అంటూ రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. మాతంగి స్వర్ణలత చెప్పే భవిష్యవాణిని వినడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఉజ్జయిని మహంకాళి ఆలయానికి తరలివచ్చారు. ఇక ఈరోజు ఈ రంగం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
ఘనంగా అమ్మవారికి ఊరేగింపు
రంగం కార్యక్రమం అనంతరం ఘనంగా అమ్మవారికి ఊరేగింపు చేస్తారు. ప్రస్తుతం ఘనంగా అమ్మవారి అంబారీ ఊరేగింపు జరుగుతోంది. ఈ ఊరేగింపు కోసం కర్ణాటక తుంకూరులోని కర్రి బసవ స్వామి మఠం నుంచి తెలంగాణకు 33 ఏళ్ల ఆడ ఏనుగు లక్ష్మిని తీసుకువచ్చారు. ఈరోజు సాయంత్రం పలహారం బండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications