మృత్యుదారి ఔటర్ రింగ్ రోడ్డు: కార్లు ఢీ, మెడికో మృతి
హైదరాబాద్: హైదరాబాదు ఔటర్ రింగ్‌రోడ్డుపై రోడ్డు ప్రమాదాలకు కళ్లెం పడడం లేదు. తాజాగా రింగ్‌రోడ్డుపై శుక్రవారం ఉదయం మరో ప్రమాదం చోటుచేసుకుంది. కోకాపేట వద్ద రెండుకార్లు వేగంగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో సల్మాన్ అనే మెడికో మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదిలావుంటే, వరంగల్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన విద్యార్థి గార్ల చంద్రశేఖర్ (20) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లో ఐటీఐ చదువుతున్న చంద్రశేఖర్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
గురువారం హైదరాబాద్ నుంచి రైలులో కేసముద్రం వెళుతూ రఘునాథపల్లి వద్ద రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని ఖాజీపేట జీఆర్‌పీ పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ద్వారా అతడి వివరాలు తెలుసుకున్నారు

వరంగల్ జిల్లా మహబూబాబాద్ శివారు బాబాగుట్ట కాలనీలో గురువారం ఇంటి ప్రహరీ కూలీ నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. నర్సింహులపేట మండలం దాట్లకు చెందిన వేల్పుల ఉపేందర్-సునిత దంపతులకు కుమార్తె అమూల్య, నాలుగేళ్ల కుమారుడు మహేందర్ సంతానం.
బుధవారం సునిత పిల్లలిద్దరినీ తీసుకుని బాబాగుట్టలో నివసిస్తున్న తల్లి స్వర్గం ఉపేంద్రమ్మ ఇంటికి వెళ్లింది. గురువారం ఉదయం 6గంటల సమయంలో ఎదురుగా ఉన్న బానోత్ చాంప్లానాయక్ ప్రహరీ పక్కనే మహేందర్ (4) ఆడుకుంటున్నాడు. అదే సమయంలో సిమెంట్ బ్రిక్స్‌తో కట్టిన ప్రహరీ కూలీ బాలుడి మీద పడింది. దీంతో ఆ బాలుడి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కెడే మృతి చెందాడు.












Click it and Unblock the Notifications