ఏపీతో ఇబ్బంది పడుతున్నాం.. తెలంగాణలో కలపండి: గవర్నర్ కు విలీనగ్రామాల విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. తొలుత శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శనం చేసుకుని అనంతరం ఆదివాసీలతో సమావేశంలో పాల్గొన్నారు. భద్రాచలం వీరభద్ర పంక్షన్ హాల్ లో ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై తన పర్యటన సందర్భంగా గిరిజనులతో ఆరోగ్యరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భద్రాచలం సరిహద్దు ఆదివాసీ గ్రామాల ప్రజల సమస్యలు, ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామ పంచాయతీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భద్రాచలం సరిహద్దులో ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని ఐదు గ్రామాల ప్రజలు గవర్నర్ తమిళిసై కి విజ్ఞప్తి చేశారు. పురుషోత్తమపట్నం, ఎటపాక, పిచుకలపాడు, కన్నాయిగూడెం, గుండాల కు చెందిన గిరిజనులు గవర్నర్ ను కలిసి తాము ఏపీ లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నామన్నారు.

ఏపీ చాలా దూరంగా ఉందని అందువల్ల తమను తెలంగాణ ప్రాంతమైన భద్రాచలంలో కలపాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని కోరిన గిరిజనులకు గవర్నర్ ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గిరిజనలు ఎదుర్కొంటున్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా తాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని చెప్పారు.
ఆదివాసీల సమస్యల పరిష్కార బాధ్యతలు తనకు అప్పగించారని, తప్పక పరిష్కరిస్తానని గవర్నర్ తమిళిసై వారికి హామీ ఇచ్చారు. ఆదివాసీలను సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చేయడంలో అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివాసీలు విద్య, వైద్యం విషయాలలో వెనకబాటుతనానికి గురవుతున్నారన్నారు.
విద్య, వైద్యం వంటి మౌలిక వసతులు ఆదివాసీలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. సరైన పోషకాహారం లేక ఆదివాసీలు బలహీనులుగా మారుతున్నారని నాణ్యమైన పోషకాహారం అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అసమానతలు తొలగించి అందరూ సమానంగా జీవించే విధంగా పని చేస్తామని గవర్నర్ తమిళిసై తెలిపారు.












Click it and Unblock the Notifications