కుక్కలు మొరిగితే మొరగనివ్వాలి: అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుక్కలు మొరిగితే మొరగనివ్వాలని, కుక్కల పని మొరగడమేనని, సింహాలు తమ దారిన తాము నడుచుకుంటూ వెళతాయని వ్యాఖ్యానించారు. ఆయన శివసేన గురించి, రాజ్‌థాక్రే గురించి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అక్బరుద్దీన్ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఔరంగాబాద్‌లో మొగల్ చక్రవర్తి జౌరంగజేబు సమాధిని సందర్శించారు. మహారాష్ట్రలో లౌడ్‌స్పీకర్ వివాదానికి తెరలేపిన రాజ్‌థాకరే పేరును ఒవైసీ ప్రస్తావించకుండా విమర్శలు చేశారు. సొంత ఇళ్ల నుంచి పంపించేసినవారి గురించి, గుర్తింపు లేనివారి గురించి తాను మాట్లాడనన్నారు. ఎవరి గురించి తాము భయపడమన్నారు.

ఔరంగజేబు సమాధిని సందర్శించడం ద్వారా అక్బరుద్దీన్ ఒవైసీ మతవిద్వేషాలను పెంచుతున్నారంటూ శివసేన, బీజేపీ నేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మతపరమైన ఉద్రిక్తతలకు ఒవైసీ కారకులవుతున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోపోతే తామే ఆయనపై, ఆయన పార్టీపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీచేశారు. ఒవైసీపై దేశద్రోహం కేసు పెట్టాలని భారతీయ జనతాపార్టీ డిమాండ్ చేసింది.