రైతుల జీవితాలతో ప్రతిపక్షాల రాజకీయాలా? మండిపడిన మంత్రి ఎర్రబెల్లి!!
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్న వేళ, ప్రతిపక్షాలు రైతుల రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రైతుల జీవితాలతో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తూ ఆడుకుంటున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి ఎంతో చేస్తుందని చెప్పిన ఆయన, రైతు సంక్షేమం కోసం కేసీఆర్ తీసుకున్న పలు నిర్ణయాలను వెల్లడించారు.
అకాల వర్షాలు రైతాంగాన్ని ఆపార నష్టాల్లోకి నెడుతున్నాయని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి, మొన్నటి దాకా పంట నష్టాలు, ఇప్పుడు వాటితోపాటు ధాన్యం తడిసి రైతుల సమస్యలు మరింత పెరిగాయని, అందుకే మనసున్న మన సీఎం కెసిఆర్ తడిసిన ధాన్యాన్ని మామూలు ధరకే కొంటామని ప్రకటించారన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఇందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయని, కానీ వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో, దేశంలో ఎక్కడైనా సరే, ఈ విధంగా రైతు సంక్షేమం కోసం పని చేస్తున్నారా? రైతులను ఆదుకుంటున్నారా? అని నిలదీశారు. ఇక్కడ మాత్రం రైతులను ఎందుకు రెచ్చగొడుతున్నారు? చెప్పాలన్నారు. రైతులు ప్రతిపక్షాల కుటిల నీతిని గుర్తించాలని, సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల పంటలను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతుల పంటల నష్టాలకు ఎకరాకు రూ.10వేలు ప్రకటించిందని గుర్తు చేశారు. కౌలు రైతులకు కూడా నష్టాల పరిహారం అందేలా ప్రభుత్వం చేస్తుందన్నారు. ఇంతగా చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని మంత్రి అన్నారు.
తడిసిన ధాన్యాన్ని కూడా మామూలు ధాన్యం ధరకే కొనుగోలు చేస్తామని ప్రకటించడం సీఎం కేసీఆర్ విశాల హృదయానికి నిదర్శనమన్నారు. అయితే, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్న ప్రతిపక్షాలు లేనిపోని డిమాండ్లు పెట్టి, రైతులను ఆగం చేస్తున్నాయని అన్నారు. వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ తరహాలో రైతులకు ప్రోత్సాహకాలు, పరిహారాలు ఇచ్చి మాట్లాడాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. రైతులు ఓపికగా ఉండాలని ప్రభుత్వం చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications