బట్ట కాల్చి మీదేస్తారా.. దొరలెవరో.. దొంగలెవరో త్వరలోనే తేలుతుంది!!
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై బండి సంజయ్ ,రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి దమ్ముంటే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ విసిరారు. గాలికి మాట్లాడి బట్ట కాల్చి మీద వేయడం కాదని సరైన ఆధారాలతో మాట్లాడాలని మండిపడ్డారు.
గుజరాత్ లో పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్లు శిక్ష విధించి ఆరోపణలు నిరూపించమని అడుగుతున్నారని, రాహుల్ గాంధీకి ఒక నీతి, మీకు ఒక నీతి ఉంటుందా అంటూ ప్రశ్నించారు. బిజెపి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.
రాహుల్ గాంధీ పై అనర్హత వేటు బిజెపి నియంతృత్వానికి అణిచివేతకు నిదర్శనమని, పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఎర్రబెల్లి దయాకర్ రావు అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలపై బీజేపీ ఉక్కుపాదం మోపుతోందని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు.

ఇక బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం కాదు దమ్ముంటే వాటిని నిరూపించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పగలు, రాత్రి తేడా లేకుండా కేటీఆర్, కెసిఆర్ పని చేస్తుంటే, పని పాట లేని బండి సంజయ్, రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తున్నారని సరైన సమయంలో ప్రతిపక్షాలకు బుద్ధి చెబుతారని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు .
టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్న ఎర్రబెల్లి త్వరలో ఎవరు దొంగలో ఎవరు దొరలో దర్యాప్తులో తేలిపోతుందని వెల్లడించారు. రైతు సంక్షేమ కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులకు భరోసా ఇచ్చిన నాయకుడు కెసిఆర్ అన్నారు.
కేసీఆర్ మనసున్న మారాజు అని మరోసారి నిరూపించుకున్నారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశంలో ఎక్కడా మూడు వేలకు మించి పంట నష్ట పరిహారం ఇవ్వలేదని, మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో పదివేల రూపాయలు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి కొనియాడారు. రైతుల పక్షాన నిలిచిన పెద్ద రైతు కేసీఆర్ అని కితాబిచ్చారు.












Click it and Unblock the Notifications