మళ్ళీ పదేళ్ళు కాంగ్రెస్ దే అధికారం.. ఎందుకంటే!
తెలంగాణ రాష్ట్రంలో మరో పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని మంత్రి కొండా సురేఖ అభిప్రాయం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మొద్దని, రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నేడు వరంగల్ నగరంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కొండ సురేఖ సన్న బియ్యం పంపిణీని అన్నివర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ సన్నబియ్యం పంపిణీ ఆగదని పేర్కొన్నారు.
సన్నబియ్యం పంపిణీ చేసిన మంత్రి కొండా సురేఖ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం దేశానికి ఆదర్శమని అటవీ,పర్యావరణ,దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. నేడు వరంగల్ తూర్పు నియోజకవర్గం వ్యాప్తంగా రేషన్ దుకాణాలలో లబ్ధిదారులకు సన్న బియ్యం అందించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ నిరుపేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రారంభించిన సన్నబియ్యం కార్యక్రమం ఎంతో విజయవంతం అయిందన్నారు.

సన్నబియ్యం పంపిణీతో నిరుపేదలకు లబ్ది
లబ్ధిదారులు కూడా దానిని సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. గతంలో దొడ్డుబియ్యం ఇవ్వడం వల్ల దళారీ వ్యవస్థ ఏర్పడి రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు అమ్ముకుని సొమ్ము చేసుకునే వారని, నేడు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంతో ప్రతి లబ్ధిదారుడు సన్నబియాన్నే వినియోగించుకుంటూ అక్రమ దందాకు అడ్డుకట్ట వేసినట్లు అయిందని మంత్రి సురేఖ తెలిపారు. ప్రజాప్రభుత్వంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మదిలో చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో మిల్లర్లు లాభపడ్డారు
రాబోయే రోజులలో మరిన్ని సంక్షేమ పథకాలతో అప్పుల రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారని తెలిపారు. ఆహార భద్రత చట్టం తీసుకు వచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని కొండా సురేఖ పేర్కొన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం మిల్లర్లకు లాభం చేసే విధంగా పని చేసిందని ఆమె విమర్శించారు.
బీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితి లేదు
బి ఆర్ ఎస్ పదేళ్ల పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్నది జరగలేదన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్చుకోలేక కావాలని బీఆర్ఎస్ నేతలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించారని, కట్టిన నాలుగేళ్లకే అది కుంగిపోయింది అని కొండా సురేఖ విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం చేసిన బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కొండా సురేఖ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications