డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు-దేశంలో ఎక్కడా లేనివిధంగా-ఇక్కడ రూ.1కోటిన్నర-ప్రారంభించిన కేటీఆర్
దేశంలోని మరే మెట్రోపాలిటన్ నగరంలో లేనివిధంగా ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే పేదలకు ఉచిత డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వడం జరుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. పేదలపై ఒక్క పైసా భారం పడకుండా రూ.9వేల కోట్ల వ్యయంతో ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తోందన్నారు. హుస్సేన్ సాగర్ తీరాన నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.
Recommended Video
ఇక్కడ ఒక్కో డబుల్ బెడ్ రూమ్ విలువ రూ.1కోటి 50లక్షలు ఉంటుందని అన్నారు. ఆదివారం(జూన్ 26) సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డివిజన్‌లోని అంబేడ్కర్ నగర్‌లో నిర్మించిన 330 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

రూ.28 కోట్ల పైచిలుకు వ్యయంతో...
సనత్ నియోజకవర్గంలోని ఈ ప్రాంతంలో రూ.28.50 కోట్ల వ్యయంతో 330 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించారు. ఇళ్ల ప్రారంభోత్సవం అనంతరం అర్హులైన లబ్దిదారులకు డబుుల్ బెడ్ రూమ్ ఇళ్ల పత్రాలను మంత్రి కేటీఆర్ అందజేశారు. అంబేడ్కర్ నగర్ వాసులు ఎన్నడూ ఊహించని విధంగా... వారికి పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం అద్భుతమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇచ్చిందన్నారు. ఇళ్లతో పాటు 26 షాపులను కూడా నిర్మించడం జరిగిందని... ఈ షాపుల ద్వారా వచ్చే అద్దెలతో భవనాలు,లిఫ్టుల నిర్వహణ జరుగుతుందని తెలిపారు. లబ్దిదారులు తమ ఇళ్లు,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ఒక్కో డబుల్ బెడ్ రూమ్ విలువ రూ.1కోటిన్నర...
'హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. ప్రతీ ఒక్కరూ పరిశుభ్రత, పచ్చదనంపై దృష్టి పెట్టాలి. ఇక్కడ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో మొత్తం 10 లిఫ్టులు ఉన్నాయి. ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని 560 చదరపు అడుగుల్లో ఒక్కో యూనిట్‌కు రూ.8లక్షల 50వేలు వ్యయంతో ప్రభుత్వం వీటిని నిర్మించింది. ఇవాళ హుస్సేన్ సాగర్ తీరాన లేక్ వ్యూ దగ్గర డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అంటే రూ.1కోటిన్నర విలువ. పేదల కోసం ప్రభుత్వం ఉచితంగానే ఇళ్లను మంజూరు చేస్తోంది.' అని కేటీఆర్ పేర్కొన్నారు.

మనసున్న మహారాజు కేసీఆర్ : తలసాని
ఇదే కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మహారాజు అని ప్రశంసించారు. ఐడిహెచ్ కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొని తిరిగి వెళ్ళే సమయంలో అంబేడ్కర్ నగర్ లోని పూరి గుడిసెలు,అక్కడి పేద ప్రజల జీవన స్థితిని చూసి ఆయన చలించిపోయారని గుర్తుచేశారు. వెంటనే ఆ పూరి గుడిసెల స్థానంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారని... ఇప్పుడు ఆ హామీని నెరవేర్చారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని... పేదలు గొప్పగా బతకాలనే ఆయన సంకల్పానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లే నిదర్శనమని అన్నారు.
ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీతో పాటు ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, జీహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications