35,611 కొత్త ఉద్యోగాలు: 'హైదరాబాద్‌కు మరిన్ని పెద్ద కంపెనీలు రాబోతున్నాయి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఐటీ ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని సాధించిందన్నారు. 2014-15లో ఐటీ ఎగుమతులు రూ. 67 వేల కోట్లు కాగా, 2015-16లో ఐటీ ఎగుమతులు రూ. 75 వేల కోట్లు దాటాయని వెల్లడించారు.
గతేడాదితో పోలిస్తే ఇది 13.26 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు. ఇది జాతీయ సగటుకన్నా ఒక శాతం ఎక్కువని అన్నారు. ఐటి మరియు ఐటీఈఎస్ ఎగుమతుల్లో పెరుగుదల జాతీయ సగటు 12.3 శాతం కంటే ఎక్కువ అని చెప్పారు. గేమింగ్, యానిమేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు పాలసీలను ప్రకటించామన్నారు.

రాష్ట్రంలో కొత్త ఐటీ విధానాన్ని ప్రకటించామని, యానిమేషన్, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో కూడా విధానం ప్రకటించామని చెప్పారు. ఒక్క ఐటీ రంగంలోనే సుమారు 35, 611 కొత్త ఉద్యోగాలను సృష్టించామన్నారు. టాస్క్ ద్వారా గతేడాది 45 వేల మందికి ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిపారు.

ఐటీ పరిశ్రమను హైదరాబాద్‌కే పరిమితం కాకూడదని సీఎం చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ సేవలను విస్తరిస్తామని పేర్కొన్నారు. వరంగల్‌లో ఐటీ రీసెర్చ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి 1800 మంది ఉపాధి కల్పిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఇప్పటికే హైదరాబాద్‌లో పెద్ద కంపెనీలు ఉన్నాయని, భవిష్యత్తులో చాలా కంపెనీలు హైదరాబాద్ రాబోతున్నాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని 26 విభాగాలు విస్తృతంగా ఐటీ విధానాన్ని వినియోగిస్తున్నాయని, మీసేవ ద్వారా మరిన్ని సేవలు అందించడానికి కృషి చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు.
మీ సేవను గ్రామీణ స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ-పంచాయతీలను ప్రారంభిచామని ఈ సందర్భంగా చెప్పారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టీహబ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. సిలికాన్ వ్యాలీలో టీహబ్ ఔట్‌పోస్టును ప్రారంభిస్తామని చెప్పారు.
టీహబ్‌తో గూగుల్, మైక్రోసాఫ్ట్, సిస్కోలాంటి సంస్థలు ఒప్పందం చేసుకున్నాయని తెలిపారు. డిఫెన్స్ సెక్టార్‌లో టీహబ్‌తో కలిసి పనిచేసేందుకు రక్షణశాఖ ముందుకు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ తతదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డిజిటల్ తెలంగాణా రూపకల్పనలో కృషిచేసిన ఐఐటి బాసర విద్యార్థులకు ప్రతిభ అవార్డులతో పాటు నగదు పురస్కారాలను ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 100 శాతం డిజిటల్ లిటరసీ సాధించిన బాసర, నారసింగ్ పూర్ సర్పంచులను అవార్డులతో సత్కరించారు.












Click it and Unblock the Notifications