కేటీఆర్ కొత్త ఉద్యమం: నా సర్టిఫికెట్లు షేర్ చెయ్యమంటారా?
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్హత విషయంలో గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన ఉన్నత విద్యను అభ్యసించారనడానికి ఎలాంటి ఆధారాలను కూడా ఎవరికీ చూపాల్సిన అవసరం లేదని తెలిపింది. మోదీ విద్యార్హత పత్రాలను బయట పెట్టాల్సిన పని లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం, గుజరాత్ యూనివర్శిటీ, సమాచార హక్కు ప్రధాన కమిషనర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది.
1978లో గుజరాత్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసినట్లు లోక్‌సభ ఎన్నికల సమయంలో తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో పొందుపరిచారు ప్రధాని మోదీ. 1983లో ఢిల్లీ యూనివర్శిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లూ పేర్కొన్నారు. దీని ఆధారంగా 2016లో అరవింద్ కేజ్రీవాల్- కేంద్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్ శ్రీధర్ ఆచార్యులుకు లేఖ రాశారు. మోదీ విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాలంటూ విజ్ఞప్తి చేశారు.

ప్రధానమంత్రి స్థాయి నాయకుడికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను అందజేయాలా? వద్దా? అనే విషయంపై గుజరాత్ యూనివర్శిటీ.. హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ మేరకు పిటీషన్ ను దాఖలు చేసింది. ఈ పిటీషన్ ను గుజరాత్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అరవింద్ కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ పెర్సీ కవినా వాదనలను వినిపించారు. ఇవ్వాళ వాదనలు పూర్తయ్యాయి.
న్యాయమూర్తి జస్టిస్ బీరెన్ వైష్ణవ్‌తో కూడిన ధర్మాసనం ఇవ్వాళ కీలక ఆదేశాలను జారీ చేసింది. మోదీ విద్యార్హత వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆయనకు చెందిన డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను బయటపెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మోదీ విద్యార్హత వివరాలను కోరిన అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ జరిమానా విధించింది. ఏకంగా 25,000 రూపాయల మేర జరిమానా కట్టాలని ఆదేశించింది.
దీని తరువాత- తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రంగంలోకి దిగారు. ఓ కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తన విద్యార్హతలను బయటపెట్టారు. పుణే యూనివర్శిటీలో కేటీఆర్ చదువుకున్నారు. అక్కడ బయో టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. సిటీ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
ఈ సర్టిఫికెట్లను బహిరంగంగా షేర్ చేయమంటారా? అనే ప్రశ్నను సంధించారు. మోదీ విద్యార్హతలను ప్రశ్నించిన అరవింద్ కేజ్రీవాల్ పై గుజరాత్ హైకోర్టు భారీగా జరిమానా విధించిన వేసిన నేపథ్యంలో కేటీఆర్ ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. తమ తమ విద్యార్హత సర్టిఫికెట్లను వెల్లడిస్తూ పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications