భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే బూడిద మిగలడం గ్యారెంటీ: కాంగ్రెస్ గ్యారెంటీలపై కేటీఆర్!!
తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం హైదరాబాదులో నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తుక్కుగూడ లో సభ నిర్వహించి సభా వేదికగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారెంటీ లను సోనియాగాంధీ ప్రకటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ గ్యారెంటీ లపై సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అర్థ శతాబ్దపు పాలన అంతా మోసం, ద్రోహం, వంచన, దోఖాల మయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కపట కథలు, గోత్రాలు బాగా తెలిసిన తెలివైన గడ్డ తెలంగాణ గడ్డ అని పేర్కొన్న ఆయన వానలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే కల్లబొల్లి గ్యారంటీలు చెల్లవు అంటూ మండిపడ్డారు.రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దవడం గ్యారెంటీ.. కాలకేయుల కాలం వస్తే కరెంటు కోతలు కటిక చీకట్లు గ్యారంటీ అన్నారు.

మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంటే గతి, ఉచితవిద్యుత్తు ఊడగొట్టడం గ్యారెంటీ అంటూ టార్గెట్ చేశారు మంత్రి కేటీఆర్. దగాకోరుల పాలనొస్తే ధరణి రక్షణ ఎగిరిపోవడం గ్యారెంటీ, బకాసురులు గద్దెనెక్కితే రైతుబీమా, ధీమా గల్లంతవ్వడం గ్యారెంటీ అంటూ పేర్కొన్నారు. సమర్ధత లేని సన్నాసులకు ఓటేస్తే సకల రంగాలలో సంక్షోభం గ్యారెంటీ, ఢిల్లీ కీలుబొమ్మలు కుర్చీ ఎక్కితే ఆత్మగౌరవాన్ని అంగట్లో తాకట్టుపెట్టడం గ్యారెంటీ అంటూ కేటీఆర్ తీవ్రవ్యాఖ్యలు చేశారు.
దొంగల చేతికి తాళాలు ఇస్తే సంపదనంతా స్వాహా చేయడం గ్యారెంటీ, భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే బూడిద మిగలడం గ్యారెంటీ అంటూ వ్యాఖ్యలు చేశారు. కర్షకుడి కష్టం తెలియని వాళ్లకు సీటిస్తే అన్నదాత ఆగం అయిపోవడం గ్యారెంటీ, స్కాముల పార్టీకి స్వాగతం చెబితే స్కీములన్నీ ఎత్తేయటం గ్యారెంటీ అంటూ నిప్పులు చెరిగారు. పనికిమాలిన వాళ్ళు పవర్ లోకి వస్తే పరిశ్రమలు పారిపోవడం గ్యారంటీ అన్నారు.
బుద్ధి కుశలత లేనోళ్ళకు చోటిస్తే భూముల ధరలు పడిపోవడం గ్యారెంటీ అని, చేతకాని చేవలేని వాళ్లకు పగ్గాలు ఇస్తే పల్లె పల్లెనా మళ్లీ పల్లేర్లు మొలవడం గ్యారెంటీ అని, విషయ విజ్ఞానం లేని వాళ్ళను విశ్వసిస్తే వికాసం మాయమై వినాశనం గ్యారెంటీ అంటూ కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ లను టార్గెట్ చేశారు.
థర్డ్ గ్రేడ్ నాలాయక్స్ ను నమ్ముకుంటే ప్రథమ స్థానంలో వున్న స్టేట్ అధమస్థాయికిపోవడం గ్యారెంటీ..ఆర్థికశాస్త్రం తెలియని అరాచకులకు అవకాశం ఇస్తే ఎకానమీ ఏట్లో గలవడం గ్యారెంటీ..జోకర్లకు..బ్రోకర్లకు పీఠం ఇస్తే పరువు ప్రతిష్ఠలు గంగలో కలవడం గ్యారెంటీ.. గ్యారెంటీ లపై విరుచుకుపడ్డారు. దాచి..దాచి దెయ్యాలకు పెట్టేంత ఎడ్డిది కాదు..నా తెలంగాణ..ఈనగాచి నక్కల పాల్జేసేంత అమాయక నేల కాదు నా తెలంగాణ అని మంత్రి కేటీఆర్ సుధీర్ఘ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications