వారికి పథకాలు అందితే జరిగేదిదే.. మంత్రి పొంగులేటి షాకింగ్ ప్రకటన!
పథకాల కోసం అర్హులైన లబ్ధిదారులు ఎవరూ ఎవరికి రూపాయి లంచం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రిపబ్లిక్ డే సందర్భంగా నిన్న జనవరి 26వ తేదీన ఇందిరమ్మ ఇళ్ళు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను, పత్రాలను అందజేశారు.
వారికి పథకాలు అందినట్టు తేలితే ఇలా చేస్తాం: మంత్రి పొంగులేటి
ఫిబ్రవరి మొదటివారం నుంచి మార్చి వరకల్లా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పథకాలు అందజేస్తామని ఆయన తెలిపారు. అనర్హులకు పథకం అందిందని తెలితే వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి అన్ని ప్రయోజనాలను నిలిపివేస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి షాకింగ్ ప్రకటన చేశారు.

వారికోసం త్వరలోనే సీఎం నిర్ణయం
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం పెంబర్తి లోను, ధర్మసాగర్ మండలం క్యాతంపల్లిలోను రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభించి మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక దళిత, గిరిజన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో అదనంగా ఇళ్ల మంజూరు పైన సీఎం రేవంత్ రెడ్డి త్వరలో నిర్ణయం తీసుకుంటారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
గ్రామసభల ద్వారా దరఖాస్తులు
గత ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించకుండానే నాలుగు గోడల మధ్య కూర్చుని పథకాలు అమలు చేసిందని, కానీ ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ప్రజల మనసు తెలుసుకొని గ్రామ సభలను నిర్వహించి దరఖాస్తులను తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికను చేస్తుందని వెల్లడించారు.
వీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
జాబితాలో పేర్లు రాని వారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన వారు ఎప్పుడు దరఖాస్తు చేసుకుంటే అప్పుడు పథకాలను అందిస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గత పాలకులు అర్హులను నిరుపేదలను మరిచిపోయారని విమర్శలు గుప్పించారు. పథకాలు కోసం ఎవరు మధ్యలో దళారులను నమ్మి వారికి డబ్బులు ఇచ్చి మోసపోకూడదన్నారు.












Click it and Unblock the Notifications