ఎవరుపడితే వాళ్లు అడిగితే ఇవ్వరు: నంది అవార్డులపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: నంది అవార్డుల వివాదంపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ నుంచి ఎవరూ సర్కారుకు ప్రతిపాదన పంపలేదన్నారు. పురస్కారాలు ఇవ్వాలని ఎవరూ అడగలేదని స్పష్టం చేశారు. అయినా ఎవరు పడితే వాళ్లు అడిగితే నంది అవార్డులు ఇవ్వరని తేల్చి చెప్పారు. వచ్చే సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తరపున నంది అవార్డులు ఇస్తామని మంత్రి తలసాని తెలిపారు.
కృష్ణ జయంతి సందర్భంగా 'మోసగాళ్లకు మోసగాడు' రీరిలీజ్ చేయనున్న క్రమంలో ఇటీవల నిర్మాతలు ఆదిశేషగిరిరావు, అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో సినీ నిర్మాత ఆది శేషగిరి రావు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డులు ఇవ్వాలన్న ఆసక్తి రెండు ప్రభుత్వాలకూ లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు.

ఒకప్పుడు ప్రభుత్వ అవార్డుకు విలువ ఉండేదని.. ఇప్పుడు తన ఉద్దేశంలో ఆ అవార్డుకు విలువ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఎవరి పేరూ ఎత్తకుండా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించడం గమనార్హం. మరోవైపు, దాసరి నారాయణరావు నిరంతరం కార్మికుల కోసం కృషి చేశారని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దాసరి మరణించిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్దదిక్కు లేకుండా పోయిందన్నారు.
దాసరితో తనకు మంచి అనుబంధం ఉండేదన్నారు తలసాని. చిత్రపురి కాలనీ కోసం దాసరి ఎంతో కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చిత్రపురి కాలనీ వాసులకు కూడా అందజేసేట్లు కృషి చేస్తామన్నారు. దాసరి వంటి గొప్ప వ్యక్తి మళ్లీ పుట్టరని వ్యాఖ్యానించారు. సినీ కార్మికుల గురించి దాసరి తన జీవితాన్నే త్యాగం చేశారని కొనియాడారు. దాసరి బతికి ఉన్నప్పుడు ఆయన ఇల్లు ధర్మసత్రం తరహాలో ఉండేదన్నారు. దాసరిని కోల్పోయిన తర్వాత కార్మికులకు ఆయన లేని లోటు తెలిసి వస్తోందన్నారు మంత్రి తలసాని.
హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీలో తెలుగు సినీ వర్కర్స్ కో -ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని.. దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు కుమారుడు అరుణ్ కుమార్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications