ఫిలిప్పీన్స్ కు మన తెలంగాణ బియ్యం.. ప్రారంభం ఎక్కడి నుంచో తెలుసా..?
తెలంగాణ బియ్యానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. విదేశాల్లో తెలంగాణ బియ్యానికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ మేరకు ఫిలిప్పీన్స్ దేశానికి 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు గతంలో ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి విడతలో 12,500 టన్నుల బియ్యం ఎగుమతి చేసే నౌకను కాకినాడ పోర్టులో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ రైతాంగంలో ఇదో కీలక ఘట్టం అని మంత్రి ఉత్తమ్ అభివర్ణించారు.

రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం ఎగుమతులను మరింత ప్రోత్సహించేందుకు కృషి చేస్తుందన్నారు. తెలంగాణలో 280 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతోందని.. రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చిన తర్వాత మిగిలిన బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామని వెల్లడించారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. అందుకు ఇక్కడి మట్టి, వాతావరణ పరిస్థితులే కారణమని తెలిపారు.
ఫిలిప్పీన్స్ కు మన తెలంగాణ బియ్యం. కాకినాడ నుంచి తొలి సరకు రవాణా..!#UttamKumarReddy #Rice #Philippines #Telangana #KakinadaPort #OITelugu pic.twitter.com/iV6nawYRQH
— oneindiatelugu (@oneindiatelugu) March 31, 2025
గత ప్రభుత్వాలు ఇలాంటి ఎగుమతులు చేయలేదని తెలిపారు. ఫిలిప్పీన్స్‌తో పాటు ఇతర దేశాలతో కూడా రైస్ ఎగుమతులపై సంప్రదింపులు జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణ రైతులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో మరిన్ని దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలను రాష్ట్రంలో మెరుగుపరుస్తామన్నారు మంత్రి ఉత్తమ్. మరోవైపు రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరిన్ని దేశాలకు తెలంగాణ బియ్యం ఎగుమతుల అవకాశాలపై చర్చలు కొనసాగుతున్నాయని.. రైతులకు మంచి ధర అందించేందుకు, పత్తి, గోధుమ వంటి ఇతర పంటల ఎగుమతులపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications