మంత్రి వివేక్ వెంకటస్వామికి తప్పిన ప్రమాదం..
తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామికి పెను ప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయ్‌లో ముందున్న ఓ వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో.. వెనుకే వస్తున్న నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. మెదక్ జిల్లాలో పర్యటన ముగించుకుని హైదరాబాద్ వైపు తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో నర్సాపూర్ మండలంలో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో కార్ల ముందు భాగాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మంత్రి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో మంత్రితో పాటు మరెవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదానికి ముందు..
ఈ ప్రమాదానికి ముందు మంత్రి వివేక్ నర్సాపూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణి చేశారు. అలానే నూతన రేషన్ కార్డులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
ఒక మహిళ ఆర్థికంగా నిలబడితే, ఆమె కుటుంబం, సమాజం సుస్థిరంగా ఉంటుందని మంత్రి వివేక్ వ్యాఖ్యానించారు. మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. స్కూళ్లు, కళాశాలల్లో మౌలిక సదుపాయాల పెంపునకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని.. ప్రజా నిధులను దుర్వినియోగం చేశారని విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications