మూడంచెల భద్రత మధ్య మిస్ వరల్డ్ పోటీలు.. భాగ్యనగరానికి 110 దేశాల సుందరీమణులు!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 72వ మిస్ వరల్డ్ పోటీలు అత్యంత ఘనంగా తెలంగాణా రాష్ట్రంలో ప్రారంభం అవుతున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ మిస్ వరల్డ్ పోటీలు వాయిదా పడతాయా అని భావించినా, అలాంటిదేమీ లేదని ఈరోజు సాయంత్రం మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి.
72వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య హైదరాబాద్ లో ఈ సాయంత్రం 72వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం అయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'తెలంగాణ జరూర్ ఆనా' నినాదంతో నిర్వహిస్తున్న ఈ పోటీల ప్రారంభోత్సవానికి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ముస్తాబయింది. దాదాపు 110 దేశాల ప్రతినిధులు ఇప్పటికే నగరానికి చేరుకుని రిహార్సల్స్ పూర్తి చేయగా, మన దేశానికి నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మనదేశంలోనే వరుసగా రెండు సంవత్సరాలు పోటీలు
వెయ్యి మందికి పైగా అతిధులు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ మిస్ వరల్డ్ పోటీలను చూసేందుకు హాజరుకానున్నారు. 350 మంది పైగా కళాకారులు, దాదాపు రెండు గంటల పాటు చేసే విన్యాసాలు, కళా ప్రదర్శనలతో మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవం అలరించనుంది. మిస్ వరల్డ్ చరిత్రలో మొదటి సారి మన దేశం వరుసగా రెండు సంవత్సరాలు పోటీలను నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచింది.
మే 31న హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ ఫైనల్ పోటీ
నేటి నుండి మొదలై మే 31న హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పోటీ అంగరంగ వైభవంగా జరగనుంది. సాంస్కృతిక, సామాజిక ప్రయోజనాల మేళవింపుగా, మూడు వారాల పాటు మిస్ వరల్డ్ వేడుకలు, కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగనున్నాయి. మిస్ వరల్డ్ పోటీదారులు రాష్ట్రంలోని వరంగల్, పోచంపల్లి, బుద్ధవనం, యాదగిరిగుట్ట, మహబూబ్‌నగర్ ప్రాంతాల సాంస్కృతిక, చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ నెల 13న చార్మినార్, లాడ్ బజార్ దగ్గర హెరిటేజ్ వాక్ జరుగుతుంది.
మూడంచల భద్రతతో మిస్ వరల్డ్ పోటీలు
హైదరాబాద్ లోని AIG ఆసుపత్రిని, తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ని సందర్శించి ఆయా రంగాల్లో పర్యటకుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను పోటీదారులు తెలుసుకుంటారు. ఈనెల 22 నుంచి పలు పోటీలు జరుగుతాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు గచ్చిబౌలి, హైటెక్స్ చుట్టుపక్కల మూడంచల భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 5 వేల మందికి పైగా పోలీసులను వివిధ ప్రాంతాలలో మోహరించారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, క్విక్ రియాక్షన్ బృందాలను స్టేడియం చుట్టూ మోహరించారు.












Click it and Unblock the Notifications