త్వరలోనే మంత్రిని అవుతా - ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదృష్టం కలిసి వస్తే త్వరలోనే తనకు మంచి పదవి లభిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ ఓపికతో ఎదురుచూశానని.. త్వరలోనే మంత్రి పదవి వస్తుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. దీంతో ఆయన ఇప్పుడు చేసిన కామెంట్స్ కాంగ్రెస్ వర్గాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.
కాగా గత కొంత కాలంగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని ఆశిస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలోనే అధిష్ఠానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని ఆయన పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. అయితే ఆ హామీ ఇప్పటివరకు నెరవేరలేదని.. దీనిపై అనేక సందర్భాల్లో మీడియా సమావేశాల్లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పార్టీ అంతర్గత పరిణామాలపై కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు వివాదాస్పదం అయ్యాయి.

ఎమ్మెల్యేగా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా నియోజకవర్గ అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. అదే మంత్రి పదవి లభిస్తే, మరింత వేగంగా, విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే గతంలో మంత్రి పదవి దక్కకపోవడంపై అసహనంతో, కాస్త తీవ్ర స్వరంతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు మాత్రం సానుకూల ధోరణితో మాట్లాడటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఆయన మాటల్లో కనిపిస్తున్న ఆశావహ ధోరణి, అధిష్ఠానం నుంచి ఏమైనా సానుకూల సంకేతాలు అందాయా? అనే ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌లో మంత్రి మండలి విస్తరణ జరిగితే.. రాజగోపాల్ రెడ్డి పేరు పరిశీలనలో ఉండే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications