మహానుభావుడు: ప్రజాసేవ కోసమే భూమి కజ్జా చేశాడట!!
జనగామ రాజకీయాల్లో ఆసక్తికర పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. జనగామ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ఆయన భూముల కబ్జాపై ఆయన కుమార్తె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యటం, తన తండ్రి కబ్జా చేసిన భూమిని మున్సిపాలిటీకి ఇస్తానని ప్రకటించటం వెరసి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై స్థానికంగా చర్చ జరుగుతుంది.
జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ప్రజాసేవ కోసం దానధర్మాలు చేస్తారు కానీ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాత్రం ప్రజాసేవ కోసం భూమిని కబ్జా చేశాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చేర్యాల చెరువు శిఖం భూములు కబ్జా చేసినట్లు ఎట్టకేలకు ఆయన ఒప్పుకున్నారు.

ప్రజాసేవ కోసమే భూమిని కబ్జా చేశాను అని చెప్పిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన కూతురు తుల్జా భవాని ఈ భూమిని తిరిగి మున్సిపాలిటీకి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. తన కుమార్తెను అడ్డుపెట్టుకొని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆరోపించారు.
స్థలాలను కబ్జా చేసింది కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అని, ఆయనకు దమ్ముంటే కబ్జా చేసిన భూములు వెంటనే మున్సిపాలిటీకి అప్పగించాలని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సవాల్ విసిరారు. తన కూతురు, అల్లుడు ఇద్దరు అమాయకులని, వారిని రెచ్చగొట్టి ఇంత రచ్చ చేస్తుంది రాజకీయ ప్రత్యర్దులేనని ముత్తిరెడ్డి ఆరోపణలు చేశారు. తనని ఎదుర్కోలేని వారు తన కుమార్తెను అడ్డుపెట్టుకొని కాదు.. దమ్ముంటే ప్రత్యక్షంగా ఎదుర్కోవాలని సవాల్ చేశారు.
తాను తన కూతురుపైన, అల్లుడుపైన హైకోర్టులో ఎటువంటి కేసు పెట్టలేదని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్పష్టం చేశారు. తన కూతురు బంగారు తల్లి అని, తనని ఎదుర్కోలేని వారు తన కూతురిని రోడ్దు మీదకు తీసుకువచ్చారని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆరోపించారు. ఆమెను కావాలని కొందరు మిస్ గైడ్ చేస్తున్నారని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications