కేసీఆర్‌కు హైకోర్టు, ఏసీబీ నోటీసులివ్వాలి: రఘునందన్ రావు సంచలన డిమాండ్లు
హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతోన్న అవినీతిపై సీఎం కేసీఆర్ మాట్లాడాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు దళితబంధులో రూ. 3 లక్షల కమీషన్ తీసుకున్నారని.. వారి చిట్టా తన వద్ద ఉందని బీఆర్ఎస్ సమావేశంలో సీఎం కేసీఆర్ హెచ్చరించినట్లు అన్ని పత్రికల్లో వచ్చిందని తెలిపారు రఘునందన్ రావు.దినపత్రికల్లో వచ్చిన వార్తను హైకోర్టు సుమోటోగా తీసుకుని ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వాలని కోరారు. ఏసీబీ డీజీపీకి అవినీతి ఎమ్మెల్యేల చిట్టా సీఎం కేసీఆర్ పంపించాలని రఘునందన్ డిమాండ్ చేశారు.
దళితబంధులో అవినీతికి పాల్పడుతోన్న వారిపై చర్యలు తీసుకోకుండా.. తప్పు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను కేసీఆర్ వెనకేస్తున్నారని విమర్శించారు రఘునందన్ రావు. దారినపోయే దానయ్య ఫిర్యాదు చేస్తే బీసీ మంత్రిని కేబినెట్ నుంచి తొలగించిన కేసీఆర్.. వ్యవసాయ శాఖ మంత్రి మీద ఆరోపణలు వస్తే ఎందుకు స్పందించడం లేదిన రఘునందన్ రావు నిలదీశారు. దళితబంధులో జరుగుతోన్న అవినీతిపై సీఎం కేసీఆర్ హైకోర్టుకు లేఖ రాయాలని లేకపోతే ఏసీబీ డీజీకి అవినీతి చిట్టా వివరాలివ్వాలన్నారు రఘునందన్ రావు. ఈ రెండు జరగకపోతే ఏసీబీ డీజీ సీఎం కేసీఆర్ కు నోటీసులివ్వాలన్నారు.

ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోని కేసీఆర్‌కు ముఖ్యమంత్రి సీటులో కూర్చునే అర్హత లేదన్నారు. ఊర్లలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం అమ్ముకుంటోందని రఘునందన్ రావు ఆరోపించారు. తప్పు చేస్తే తనయుడైనా..తనయ అయినా శిక్షిస్తానన్న కేసీఆర్.. ఇవాళ ఒక సీనియర్ మంత్రిపై ఆరోపణలు వస్తే ఎందుకు స్పందించరో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపముఖ్యమంత్రి రాజయ్యపై ఎలాంటి ఆరోపణలు రుజువు చేయకుండానే క్యాబినెట్ నుంచి ఎలా తొలగించారో.. బీసీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఎలా తొలగించారో... మంత్రి నిరంజన్ రెడ్డిపై అదే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఒక మంత్రిపై అన్ని ఆధారాలతో ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడితే కేసీఆర్ ఎందుకు స్పందించరని నిలదీశారు రఘునందన్ రావు. ధరణిలో లోపాలున్నాయని రైతులు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు తప్పుబట్టినా మార్పులు చేయడం లేదన్నారు. ప్రభుత్వం పేద రైతుల భూములను అప్పనంగా అమ్ముకుంటుందన్నారు . డబుల్ బెడ్రూంలో అవినీతి, ధరణిలో అవినీతి, మిషన్ కాకతీయలో అవినీతి, దళితబంధులోనూ.. ఇలా ప్రభుత్వ పథకాలన్నింటిలో దోపిడి జరుగుతోందని ధ్వజమెత్తారు రఘునందన్ రావు.
నవంబర్ లేదా డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయన్నారు రఘునందన్ రావు. ప్రజల దృష్టి మరల్చేందుకే అక్టోబర్ నెలలో ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ ఎమ్మెల్యేలతో చెప్పారన్నారు. రూ. 1500 కోట్లతో కట్టిన సచివాలయంలో సీఎం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ సచివాలయంలో కూర్చుంటే మే 1వ తేదీన దరఖాస్తు తీసుకుని వెళ్లి కలుస్తానని రఘునందన్ చెప్పారు.












Click it and Unblock the Notifications