మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీ అరవింద్ హెచ్చరిక; మునావర్ ఫారూఖీని ఆహ్వానిస్తారా? బీజేపీ ధ్వజం
తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరికలు జారీ చేశారు. మునావర్ ఫారూఖీని హైదరాబాద్ కు ఆహ్వానించటాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మునావర్ ఫారూఖీని హైదరాబాద్ కు ఆహ్వానించిన కేటీఆర్ తీరుపై రాజా సింగ్ ఆగ్రహం
స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారూఖీని మంత్రి కేటీఆర్ హైదరాబాద్ కు ఆహ్వానించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్న మునావర్ ఫారూఖీని హైదరాబాద్ కు ఆహ్వానించిన కేటీఆర్ తీరుపై మండిపడ్డారు. 16 రాష్ట్రాలు మునావర్ ఫారూఖీని వెలివేశాయని వెల్లడించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.

మునావర్ ఫారూఖీని ఆహ్వానించే ముందు కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ ముఖం చూడాల్సింది
హైదరాబాద్ వేదికగా జనవరి 9వ తేదీన జరగబోయే మునావర్ ఫారూఖీ కార్యక్రమాన్ని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ హిందూ దేవాలయాలను నిర్వహిస్తారని, పూజలు కూడా చేస్తారని పేర్కొన్న ఎమ్మెల్యే రాజాసింగ్ మునావర్ ఫారూఖీని హైదరాబాద్ ఆహ్వానించే ముందు కేటీఆర్ తన తండ్రి కెసిఆర్ ముఖమైనా చూడాల్సింది అన్నారు. మునావర్ ఫారూఖీ హిందూ దేవుళ్ళ పై కామెడీ చేయడాన్ని కేటీఆర్ సమర్ధిస్తున్నారా అంటూ నిలదీశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.

కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్
ఇక ఇదే సమయంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపి ధర్మపురి అరవింద్ హాస్యనటులను, ముఖ్యంగా మునావర్ ఫారూఖీ వంటి వారిని స్వాగతిస్తున్నందుకు ఐటి మంత్రి కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు . హైదరాబాద్‌లో స్టాండ్-అప్ కామిక్ మునవర్ ఫరూఖీ ప్రదర్శనను తమ పార్టీ అనుమతించదని హెచ్చరికలు జారీ చేశారు. కేటీఆర్ నువ్వు మనిషివా? అంటూ ప్రశ్నించారు ఎంపీ ధర్మపురి అరవింద్. మునవర్ ఫరూఖీ సీతాదేవిపై జోకులు వేస్తాడని, హిందూ దేవుళ్ళను అవమానించే విధంగా ఉండే అతని షోలను కర్ణాటకలో నిషేధించారని పేర్కొన్నారు.

తండ్రీ కొడుకులు హిందూ సమాజం అంటే కామెడీ అనుకుంటున్నారా?
ఆ వ్యక్తిని కామెడీ షో కోసం తెలంగాణకు పిలుస్తావా అంటూ ధ్వజమెత్తారు. తండ్రీకొడుకులు (ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్) హిందూ సమాజాన్ని హాస్యాస్పదంగా భావిస్తున్నారా అని ప్రశ్నించారు. అతన్ని ఇక్కడికి ఎలా తీసుకువస్తారో చూస్తాం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎంపీ ధర్మపురి అరవింద్. మునవర్ ఫరూఖీ, కునాల్ కమ్రా వంటి హాస్యనటులు హైదరాబాద్‌లో ప్రదర్శన ఇవ్వడానికి వారిని ఆహ్వానించినట్టుగా డిసెంబర్ 18న మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

హిందూ దేవుళ్ళను అవమానించిన మునావర్ ఫారూఖీ.. కేటీఆర్ ఆహ్వానం
హైదరాబాద్ నగరంలో, స్టాండ్-అప్ కమెడియన్‌లకు ఆహ్వానం లభిస్తుందని, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మునావర్ ఫరూఖీ మరియు కునాల్ కమ్రాలతో రాజకీయంగా తమకు ఎలాంటి పొత్తులేనందున మేము వారి ప్రదర్శనలను రద్దు చేయబోమని కేటీఆర్ పేర్కొన్నారు. మునావర్ ఫారుఖీని ఆహ్వానిస్తూ ప్రదర్శకులకు కెటిఆర్ ఇచ్చిన మద్దతు బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్ కు ఆగ్రహం తెప్పించింది. అంతకుముందు బెంగళూరులో ప్రదర్శన ఇస్తున్న మునావర్ ఫారూఖీ ప్రదర్శనను హిందుత్వ వాదుల ఆందోళన మధ్య నిలిపివేశారు.

మునావర్ ఫారూఖీ షో పై బీజేపీ నేతల ఆగ్రహం .. ఎలా చేస్తారో చూస్తామని హెచ్చరిక
ఈ క్రమంలో మునావర్ ఫారూఖీ ప్రదర్శనను రద్దు చేయడంపై తెలంగాణ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐటి) మంత్రి కేటీఆర్ కర్ణాటకలోని బిజెపి ప్రభుత్వాన్ని నిందించిన కొద్ది రోజుల తర్వాత కొత్త షో ప్రకటన చేశారు . హిందూత్వ సంస్థల బెదిరింపుల కారణంగా బెంగుళూరులో స్టాండ్-అప్ కమెడియన్లు మునావర్ ఫరూఖీ మరియు కునాల్ కమ్రా ప్రదర్శనలు రద్దు చేయబడ్డాయి. ఇక తాజాగా మునవర్ ఫరూఖీ జనవరిలో ఇక్కడ ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు కేటీఆర్ కు వార్నింగ్ ఇస్తున్నారు. హిందూ దేవుళ్ళను అవమానించే మునావర్ ఫారూఖీ షో ఎలా నిర్వహిస్తారో చూస్తామని వార్నింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications