కేసీఆర్ సర్కార్ సంచలనం..!!
హైదరాబాద్: అధికార భారత్ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు శాసన సభ్యుల కొనుగోలు కేసు దర్యాప్తు మరింతలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్‌కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ శాసన సభ్యుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలను పార్టీ ఫిరాయించేలా ప్రలోభ పెట్టటానికి బీజేపీ నేతలు ప్రయత్నించిన ఈ కేసులో కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ కు వెళ్లింది.
ఈ కేసును విచారించడానికి ప్రభుత్వం సీవీ ఆనంద్ సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సిట్.. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. పలువురికి నోటీసులను జారీ చేసింది. నోటీసులను అందుకున్న వారిలో కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, జాతీయ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఉన్నారు. భారత్ ధర్మ జనసేన (బీడీజేఎస్) అధ్యక్షుడు తుషార్ వెల్లంపల్లి, కేరళకు చెందిన డాక్టర్ జగ్గు కొట్టిలిల్‌పైనా ఇదివరకే లుక్ అవుట్ నోటీస్ జారీ అయ్యాయి.

అనంతరం ఈ కేసు అనూహ్య మలుపులు తిరిగింది. బీజేపీ నాయకులు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. వారి తరఫున సీనియర్ అడ్వొకేట్ రామచందర్ రావు తన వాదనలు వినిపించారు. సిట్ తన పరిధిని దాటి వ్యవహరిస్తోందని, పలు సాంకేతిక అంశాలను విస్మరించిందని ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వం కేసు పెట్టిందని, బీజేపీ పేరును ఇందులో పొందుపరచడమే దీనికి నిదర్శనమని అప్పట్లో వాదించారు.
పిటీషనర్ల తరఫు న్యాయవాదితో తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ ఏకీభవించింది. ఈ కేసు దర్యాప్తును రాష్ట్ర పరిధి నుంచి తప్పించింది. సిట్ ను రద్దు చేసింది. సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలను జారీ చేసింది. తాజాగా- తెలంగాణ ప్రభుత్వం ఈ ఆదేశాలను సవాల్ చేసింది. ఈ మేరకు అప్పీల్ పిటీషన్ ను హైకోర్టులో దాఖలు చేసింది. హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సారథ్యంలోని బెంచ్ ఈ కేసుపై విచారణ చేపట్టనుంది.












Click it and Unblock the Notifications