తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి .. టార్గెట్ టీఆర్ఎస్ .. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు వీరే
తెలంగాణలో ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ రావడంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార టీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ తదితర పార్టీల మధ్య పెను యుద్ధానికి తెరతీశాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణలో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ..ఫిబ్రవరి 16 నోటిఫికేషన్
ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతుంది. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుండగా 23వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది . ఫిబ్రవరి 24న నామినేషన్లు పరిశీలించి, నామినేషన్ల ఉపసంహరణకు 27వ తేదీ వరకు గడువు విధించారు. మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, మార్చి 17వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు బీజేపీ కూడా తన అభ్యర్థులను ప్రకటించింది .

బీజేపీ , కాంగ్రెస్ అభ్యర్థులు వీరే
హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ అభ్యర్థిగా ఎం రామచందర్ రావు పేరును ప్రకటించింది బిజెపి. అలాగే వరంగల్ నల్గొండ ఖమ్మం అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరును పార్టీ ప్రకటించింది. అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరింది. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగిన పలువురు నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు . హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అభ్యర్థిగా చిన్నారెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. అలాగే నల్గొండ ఖమ్మం వరంగల్ అభ్యర్థిగా రాములు నాయక్ పేరును ఖరారు చేసింది.

టీఆర్ఎస్ పార్టీ నల్గొండ-ఖమ్మం-వరంగల్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఇంకో స్థానంలో డైలమా
ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పార్టీ నల్గొండ-ఖమ్మం-వరంగల్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును ప్రకటించగా , హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిని కూడా త్వరలో ప్రకటిస్తామని ఇటీవలే చెప్పారు. ఇప్పటికే వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ నుండి బరిలోకి దిగుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి నియోజకవర్గాలు, మండలాల వారీగా సభలు ,సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే సాగుతున్న ప్రచారం .. టార్గెట్ టీఆర్ఎస్ అంటున్న ప్రతిపక్షాలు
ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న పలువురు ఇప్పటికే ప్రచార పర్వాన్ని వేడెక్కిస్తున్నారు. టీజేఎస్ నుండి ప్రొఫెసర్ కోదండ రాం, తీన్మార్ మల్లన్న, రాణి రుద్రమ తదితరులు సైతం ఎన్నికల బరిలో నిలిచి పెద్ద ఎత్తున విద్యావంతుల ఓటు బ్యాంకు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు . ఉద్యోగ , ఉపాధి అవకాశాలకల్పన ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు . విద్యావంతులు ఆలోచించి ఓటెయ్యాలని కోరుతున్నారు.