తులం బంగారం ఎక్కడ? సూటిగా సుత్తి లేకుండా..
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు తనపైన కేటీఆర్ పైన కేసులు పెడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కోలేక రేవంత్ ప్రభుత్వం కుట్రలకు తెరతీసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
తమపై కేసులు అందుకే
కేసులు పెట్టినంత మాత్రాన తాము భయపడే వాళ్ళం కాదని తాము భయపెట్టే రకాలమని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. నేడు నిజామాబాద్ లో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన అనంతరం దేశ రాష్ట్ర రాజకీయాలపైన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు ఏం మాట్లాడినా, ఏం చేసినా కేసు
దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని, తమపై ఎన్ని కేసులు పెట్టినా నిప్పు కణికల్లాగా బయటకు వస్తామని పేర్కొన్నారు.
ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే.. కేంద్రాన్ని ఎదిరించినా కేసు... భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్నా కేసు, హీరో సీఎం పేరు మర్చిపోతే కేసు.. రైతులు భూమి ఇవ్వకపోతే కేసు, సోషల్ మీడియా పోస్టులు పెడితే కేసు అన్నట్టు ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం మాట్లాడినా కేసులు పెట్టి బెదిరిస్తున్నారన్నారు.
కాంగ్రెస్ వాళ్ళను నిలదీయాలి
ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చారని, ఎవరికైనా స్కూటీలు వచ్చాయా? తులం బంగారం వచ్చిందా? అంటూ కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ళను నిలదీయాలని, ప్రశ్నించాలని కవిత పేర్కొన్నారు. నిరుద్యోగులను, మహిళలను, ఉద్యోగులను, విద్యార్థులను అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కవిత మండిపడ్డారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ఇచ్చిన దరఖాస్తులను చెత్త కుప్పలో పడేశారన్నారు.
లోకల్ బాడీ ఎన్నికల్లో విజయంపై కవిత జోస్యం
చాలామంది రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ జరగలేదన్నారు. 57 మంది పిల్లలను గురుకులాలలో పొట్టన పెట్టుకున్నారని నిప్పులు చెరిగారు. ఇటు నుంచి సూర్యుడు అటు ఉదయించినా నిజామాబాద్ లో రాబోయే రోజులలో గులాబీ జెండానే ఎగురుతుందని కవిత పేర్కొన్నారు. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోను, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని కవిత జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications