తొలిరోజే కవితను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రశ్నాస్త్రాలు; నేడు సుప్రీంకోర్టులో కవిత భర్త కంటెంప్ట్ అఫిడవిట్!!
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి ప్రస్తుతం ఈడి అధికారులు విచారిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో కవితను అరెస్ట్ చేసిన ఈడి అధికారులు ఆమెను వారం రోజులపాటు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఏడు రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజు కవితను అధికారులు ప్రశ్నించారు.
కోర్టు ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కవితకు ప్రశ్నించిన ఈ డి అధికారులు ఆ విచారణ మొత్తాన్ని వీడియో తీశారు. అయితే విచారణలో భాగంగా కవితను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఢిల్లీ మద్యం పాలసీలో టెండర్ల కోసం ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి ఇచ్చిన 100 కోట్ల రూపాయల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయని కవితను ప్రశ్నించారు.

దీనికి సంబంధించి అన్ని ఆధారాలను ఆమె ముందు పెట్టి ఈడి అధికారులు ప్రశ్నించారు. అంతేకాదు వాట్సప్ చాట్ లు, మధ్యవర్తుల మధ్య జరిగిన లావాదేవీలపై కూడా ప్రశ్నించారని సమాచారం. 100 కోట్లకు రూపాయల లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆమె ముందు ఉంచి కవితను ప్రశ్నించారు. అంతేకాదు ఆ డబ్బు ఎవరెవరు సమకూర్చారో చెప్పాలని కవితకు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ డీలింగ్ తో సంపాదించిన 192 కోట్ల రూపాయలు ఏం చేశారని కూడా ఈడి అధికారులు కవితను ప్రశ్నించారు. కవిత ఆస్తుల కాగితాలను ఆమె ముందు ఉంచి ప్రశ్నాస్త్రాలు సంధించారు.ఇక తొలి రోజు విచారణ పూర్తయిన తర్వాత భర్త అనిల్, అన్న కేటీఆర్, న్యాయవాది విక్రమ్ చౌదరితో ములాఖత్ అయిన ఎమ్మెల్సీ కవిత మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ కేసులో తన అరెస్టు ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి కవిత చాలెంజ్ పిటిషన్ పెండింగ్లో ఉండగా, ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ నేడు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయనున్నారు. కవిత భర్త అనిల్ కంటెంప్ట్ అఫిడవిట్ ను దాఖలు చేసి న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు.
అయితే కవిత తరపున సుప్రీం కోర్టులో ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, కపిల్ సిబాల్ వాదనలు వినిపించనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఒకవైపు ఈడీ విచారణ ఎదుర్కొంటూనే సుప్రీం కేంద్రంగా కవిత ఫైట్ చేయనున్నారు.












Click it and Unblock the Notifications