MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..!
తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. కవిత గైనిక్, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కవిత గతంలో కూడా అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు ఆమెకు తీవ్ర జ్వరం వచ్చింది. ఆ తర్వాత ఆమె కళ్లు తిరిగి కింద పడిపోయారు. జైలు అధికారులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం కవితను తిరిగి తీహార్ జైలుకు తీసుకొచ్చారు.
తాజాగా కవిత మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసింది. మార్చి 15 కవిత అరెస్ట్ అయింది. గత 5 నెలలుగా ఆమె తీహార్ జైలు లో ఉంటున్నారు. కవిత బెయిల్ ఇవ్వాలని పలు మార్లు కోర్టులు పిటిషన్ వేశారు. కొద్ది రోజుల క్రితం తన అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని సుప్రీం కోర్టుకు వెళ్లారు. కవిత పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేసింది.

సుప్రీం వచ్చే గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్ట్ 27కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గీ తన వాదనలు వినిపించారు. కవితను కేటీఆర్, హరీశ్ రావు పలు మార్లు కలిశారు. కేసీఆర్ ఇప్పటి వరకు కవితను కలవలేదు. త్వరలో కవితను కేసీఆర్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా జైలులోనే ఉన్నారు.
ఆయన కూడా బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మద్యం కుంభకోణంలో అరెస్టైన కొంత మందికి బెయిల్ వచ్చింది. దీంతో కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications