జగన్ పై అందుకే ఇష్టం, చంద్రబాబు ప్రత్యేకత అదే- కవిత కీలక వ్యాఖ్యలు..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇటు జగన్ కూటమిని టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ నేతల పైన కేసులు.. విచారణలు వేగం అందుకున్నాయి. ఇదే సమయంలో జగన్ ప్రజల్లోకి రావాలని డిసైడ్ అయ్యారు. ఇక, ఏపీలో రాజకీయాలు వేడి పెంచుతున్న వేళ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ పైన బీఆర్ఎస్ ముఖ్య నేత ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
కవిత వ్యాఖ్యలతో
బీఆర్ఎస్ నేత కవిత ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కవిత ఏపీ నేతల పైన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్య నేతల గురించి వరుసగా అభిప్రాయాలు చెప్పిన కవిత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పవన్ దురదృష్టవశాత్తూ ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. చెగువేరా గురించి చెప్పే పవన్ కల్యాణ్ ఇప్పుడు పూర్తిగా బీజేపీకి రైటిస్ట్ గా మారారని చెప్పుకొచ్చారు. పవన్ చేసే స్టేట్మెంట్స్ లో ఆయనకే స్పష్టత ఉండదని పేర్కొన్నారు. పార్టీ పెట్టిన 15 ఏళ్లకు పవన్ ఎమ్మెల్యే అయ్యారని.. ఆయన చేసే ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పైన జనసైనికులు మండిపడుతున్నారు.

జగన్ అలా - చంద్రబాబు ఇలా
ఏపీ మాజీ సీఎం జగన్ పైన కవిత ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. జగన్ ను తాను అభిమానిస్తానని చెప్పారు. రాజకీయ జీవితంలో కఠిన పరీక్షలు సమర్ధవంతంగా ఎదుర్కున్నారని పేర్కొన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాను ఎక్కువగా ఇష్టపడతానని పేర్కొన్నారు. జగన్ సమస్యల పైన ప్రస్తావన చేసే విధానం తనకు నచ్చుతుందని చెప్పారు. జగన్ 2.0 ను బాగా ఇష్టపడతానని కవిత పేర్కొన్నారు. ఇదే సమయంలో కవిత ఏపీ సీఎం చంద్రబాబు గురించి కొన్ని వ్యాఖ్యలు చేసారు. సోనియా తరహాలో చంద్రబాబు హుందా రాజకీయాలు చేస్తారని పేర్నొన్నారు. చాలా సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కున్నారని కవిత వ్యాఖ్యానించారు. జైలు జీవితం అనుభవించి తిరిగి నిలదొక్కుకొని అధికారంలోకి వచ్చారని కవిత విశ్లేషించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వైరం - స్నేహం
కవిత చేసిన ఈ వ్యాఖ్యల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో చంద్రబాబుతో సమస్యలు వచ్చాయి. ఆ తరువాత జగన్ సీఎం అయ్యారు. ఏపీలో జగన్ తో కేసీఆర్ సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. తిరిగి ఇద్దరూ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావటం ఖాయమని భావించారు. ఇద్దరూ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ సమయంలో కవిత ఏపీలోని ముగ్గురు ముఖ్య నేతల గురించి చేసిన విశ్లేషణ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా కవిత మాజీ సీఎం జగన్ పైన తన అభిమానం చాటుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications