నేను ఒప్పుకోను, పదేళ్ల ఆవేదన - అసలు విషయం బయట పెట్టిన కవిత..!!
ఎమ్మెల్సీ కవిత వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. కవిత తన టోన్ పెంచుతోంది. పార్టీ పైన, తన తండ్రి కేసీఆర్ పైన గౌరవం చాటుతూనే తన లక్ష్యం ఏంటో స్పష్టం చేస్తున్నారు. కవిత రాసిన లేఖ తో మొదలైన వివాదం.. ఇప్పుడు పార్టీలో చీలిక తప్పదా అనే స్థాయిలో చర్చ కు కారణంగా మారుతోంది. అటు కవిత వ్యవహారం పైన కేసీఆర్ వేచి చూసే ధోరణితో ఉన్నారు. పార్టీనే తనకు ముఖ్యమనే విధంగా అనూహ్య నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో కవిత తన మనసులో మాట బయట పెట్టారు.
ఎమ్మెల్సీ కవిత మంచిర్యాలలో పర్యటించారు. కవిత కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కేటీఆర్, హరీష్ ఫొటోలు లేవు. కవిత పర్యటనకు బీఆర్ఎస్ శ్రేణులు దూరంగా ఉన్నారు. ఇప్పటికే కవిత చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయి. పరోక్షంగా కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకొని కవిత విమర్శలు చేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేవలం ట్వీట్లకే పరిమితం అవుతారా అంటూ ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూర్చేలా కేటీఆర్ పైన పరోక్ష వ్యాఖ్యలు చేసారు. బీజేపీ నేతల ఆస్పత్రుల ఓపెనింగ్ లకు వెళ్తున్నారంటూ హరీష్ పైన పరోక్షంగా విమర్శ లు ఎక్కు పెట్టారు. కేసీఆర్ పక్కన దయ్యాలు ఉన్నాయంటూ పార్టీ ముఖ్యుల పైన విరుచుకు పడ్డారు. ఇక, బీజేపీతో బీఆర్ఎస్ విలీనం అంటూ కవిత చేసిన వ్యాఖ్యల పైన కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

మంచిర్యాల వచ్చిన కవిత మరోసారి తన మనసులోని అభిప్రాయాలను వెల్లడించారు. ఎమ్మెల్సీ కవిత చిట్‌చాట్ నిర్వహించారు. పార్టీని కాపాడుకోవాలనేదే తన తపన అని తేల్చి చెప్పారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డానని చెప్పుకొచ్చారు. పదేళ్లుగా ఎంతో ఆవేదన అనుభవిస్తున్నానని కవిత వ్యాఖ్యానించారు. బీజేపీలో పార్టీ విలీనాన్ని నేను ఒప్పుకోనని తేల్చి చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని కవిత పేర్కొన్నారు. కేసీఆర్‌కు లేఖ రాయడంలో తప్పు లేదని అభిప్రాయ పడ్డారు. పార్టీ కోసమే కేసీఆర్‌కు లేఖ రాశానని చెప్పారు. కార్యకర్తల ఆవేదననే లేఖలో ప్రస్తావించానని వివరించారు. లేఖను బయటపెట్టినవారిని పట్టుకోవాలని కవిత డిమాండ్ చేసారు. తనకు సొంత జెండా.. అజెండా లేదని వెల్లడిచారు. కేసీఆర్ తప్ప మరో నాయకత్వాన్ని ఒప్పుకోనని మరోసారి పరోక్షంగా కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేసారు.












Click it and Unblock the Notifications