మోడీ పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్: జిహెచ్ఎంసి గంటన్నరలో రూ.5.50 కోట్లు
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దును తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా వాడుకుంది. ఆ కారణంగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి)కి రికార్డు స్థాయిలో పన్నుల చెల్లింపు జరిగింది. శుక్రవారం గంటన్నర వ్యవధిలో దాదాపు రూ.5.50 కోట్లు వచ్చి పడ్డాయి. అధికారులు విజ్ఞప్తులు చేసినా, నోటీసులు జారీ చేసినా పట్టించుకోని ప్రజలు ఆస్తి పన్ను చెల్లించడానికి ఉరుకులు పరుగుల మీద వచ్చి చేరారు.
రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ చేసిన ప్రకటనను జీహెచ్‌ఎంసీ అధికారులు తమకు అనుకూ లంగా మార్చుకున్నారు. పాత వెయ్యి, రూ.500 నోట్లతో జీహెచ్‌ఎంసీకి వివిధ రకాల పన్నులు చెల్లించాలంటూ ఒకే ఒక్క రోజు బంపర్ ఆఫర్ ప్రకటించడంతో ఇదే అదునుగా భావించిన ప్రజలు జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లోని పౌరసేవల కేంద్రాలు, మీ సేవా కేంద్రాల వద్దకు పెద్ద యెత్తున వచ్చి చేరారు.
ఐదు వందల రూపాయల నోట్లను చెలామణిలోకి తేవడానికి ఇదే మంచి అవకాశంగా భావించి పన్నులు చెల్లించేందుకు ప్రజలు ఎగబడ్డారు. పాత నోట్లతోనే వివిధ పన్నులు చెల్లించేందుకు శుక్రవారం అర్థ రాత్రి 12గంటల వరకు జిహెచ్ఎంసి అవకాశం కల్పించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24సర్కిళ్ల పరిధిలో ప్రత్యేక పౌరసేవా కేంద్రాలు ఏర్పాటు చేసి ఉదయం 7 గం టల నుంచి పాతనోట్ల ద్వారా పన్ను వసూలు స్వీక రించారు.

సాయంత్రం 7గంటల వరకు దాదాపు రూ.45 కోట్ల పన్నులు వసూలైనట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డాక్టర్ బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు.గంటన్నర వ్యవధిలో రూ. 5. కోట్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రాబట్టారు. ఇది జీహెచ్‌ఎంసీలో రికార్డు వసూళ్లని అధికారులు తెలుపుతున్నారు. జీహెచ్‌ఎంసీలో ఆస్తి పన్ను, ట్రేడ్‌లైసెన్‌సను పాత రూ. 500, 1000 నోట్లతో చెల్లించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈమేరకు జీహెచ్‌ఎంసీలోని 24 సర్కిల్ కార్యాలయాల్లో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసింది.
మున్సిపాలిటీలలో రూ.100కోట్లు?:రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలలో పాతనోట్ల ద్వారా పన్ను బకాయిలు, ప్రస్తుత సంవత్సరం పన్ను చెల్లించేందుకు అవకాశం ఇవ్వడంతో అన్ని మున్సిపాలిటీలలో దాదాపుగా రూ.100కోట్లు పన్ను వసూలైనట్లు అధికారులు తెలిపారు.