అజార్ కు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ - రేవంత్ వాట్ నెక్స్ట్..!?
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు నేతల వ్యాఖ్యలు పార్టీకి సమస్యగా మారుతున్నాయి. అటు బీసీ రిజర్వేషన్ల అంశంతో ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టాలని రేవంత్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ బై పోల్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ముగ్గురు మంత్రులకు బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ ఇక్కడ అభ్యర్ధి విషయంలో కొత్త సమీకరణాలు తెర మీదకు తెస్తున్నారు. ఈ సమయంలోనే అజార్ ఢిల్లీ కేంద్రంగా నేరుగా హైకమాండ్ తో మంత్రాంగం ఆసక్తి కరంగా మారుతోంది.
ఉప ఎన్నిక వేళ
ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచన ఒక విధంగా ఉంటే.. పార్టీ నేతలు మరోలా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ లో కొందరు నేతల వ్యవహార శైలి పార్టీకి సమస్యలు తెచ్చి పెడుతోంది. రేవంత్ కు ఇప్పుడు జూబ్లీహిల్స్ బై పోల్ లో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇప్పటికే మంత్రులు వివేక్, పొన్నం, తుమ్మలకు ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించారు. కంటోన్మెంట్ తరహాలోనే జూబ్లీ హిల్స్ లోనూ గెలుపు సాధించాలని నిర్దేశించారు. ఇక్కడ ఎంఐఎం పోటీ విషయం కీలకంగా మారుతోంది. అటు బీఆర్ఎస్ గోపీనాధ్ కుటుంబ సభ్యులను బరిలోకి దింపాలని డిసైడ్ అయింది. బీజేపీ సైతం పోటీకి సమాయత్తం అవుతోంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ నేత అజార్ ఢిల్లీ కేంద్రంగా కీలక మంత్రాంగం సాగించారు.

ఢిల్లీలో అజార్
కొద్ది రోజులుగా అజాహరుద్దీన్ తానే జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. అయితే, సీఎం రేవంత్ మాత్రం అభ్యర్ధి ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందని తేల్చి చెప్పారు. ఇప్పటికే అజార్ నియోజకవర్గంలోని నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. ఢిల్లీకి వెళ్లిన అజార్ నేరుగా జూబ్లీహిల్స్ టికెట్‌పై సోనియా, రాహుల్‌తో భేటీ అయ్యారు. తాజా పరిస్థితులను వివరించారు. రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ సైతం సమావేశ సమయంలో ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో, నియోజకవర్గంలో తనకు పోటీకి అవకాశం ఇవ్వాలని అజార్ కోరగా... సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. రేవంత్ తో సంబంధం లేకుండా నేరుగా అజార్ ఢిల్లీకి వెళ్లి పార్టీ హైకమాండ్ తో చర్చించటం.. దాదాపు గ్రీన్ సిగ్నల్ పొందటం పార్టీలో ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పుడు సీఎం సైతం అజార్ అభ్యర్థిత్వానికి మద్దతిస్తారా... కొత్త సమీకరణం తెర మీదకు తెస్తారా అనేది కీలకంగా మారనుంది.












Click it and Unblock the Notifications