హోలీ నాడు విషాదం; రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు పిల్లలతో పాటు చెరువులో దూకిన తల్లి
దేశవ్యాప్తంగా సంబరాల హోలీని సంతోషంగా జరుపుకుంటుంటే ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ ఇద్దరు చిన్నారులతో పాటు బలవన్మరణానికి పాల్పడింది. ఓ వివాహిత తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి చెరువులోకి దూకి ప్రాణాలు తీసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. హోలీ పండుగ నాడు చోటుచేసుకున్న ఈ విషాదం వివరాల్లోకి వెళితే
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఓ తల్లి ఇద్దరు చిన్నారులను చెరువులోకి తోసి, ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల వల్ల రేఖ అనే మహిళ తన ఇద్దరు చిన్నారులైన ఐదు సంవత్సరాల అన్షిక, మూడు సంవత్సరాల అభిజ్ఞలను తీసుకుని చెరువు వద్దకు వెళ్లి వారిని చెరువులో పడేసి ప్రాణాలు తీసి ఆపై తను ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాలను చెరువులో గుర్తించిన స్థానికులు ఇద్దరు చిన్నారుల మృత దేహాలను వెలికితీశారు.

తల్లి రేఖ మృతదేహం లభ్యం కాకపోవడంతో చెరువులో మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. మృతి చెందిన చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల వల్లే రేఖ పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిందని రేఖ తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ కేసులో రేఖ భర్తను, వారి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.
సమస్యలు ఏవైనా ఆత్మహత్యలకు పాల్పడడం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. చిన్న చిన్న విషయాలకే, పరిష్కరించుకోలేని పెద్ద సమస్యలుగా భావించి, వాటిని భూతద్దంలో చూసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు సమాజంలో నిత్యకృత్యంగా మారారు. సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని, పరిష్కార మార్గాలు చూడాల్సిన తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. పిల్లలతోపాటు బ్రతకాల్సిన తల్లి, అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను తీసి తాను చెరువులో దూకి చనిపోయింది.












Click it and Unblock the Notifications