మీ పిల్లలు ఆ సినిమాలు చూస్తున్నారేమో ఓ కన్నేయండి ..!
సమాజంలో నేరాలు పెరిగిపోవడానికి, యువత తప్పుదోవ పట్టడానికి సినిమాలు, వెబ్ సిరీస్‌లు కారణమని ఎప్పటినుంచో చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా కూకట్‌పల్లిలోని సంగీత్‌నగర్‌లో జరిగిన 10 ఏళ్ల సహస్ర హత్య కేసు ఈ వాదనకు మరో ఉదాహరణగా నిలిచింది. ఒక 15 ఏళ్ల బాలుడు కేవలం ఒక క్రికెట్ బ్యాట్ కోసం 10 ఏళ్ల బాలికను 18 సార్లు కత్తితో పొడిచి చంపడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దారుణానికి వెనుక ఓటీటీలో చూసిన వెబ్ సిరీస్‌లు, మితిమీరిన హింసే కారణమని వెలుగులోకి వచ్చింది.
వైలెన్స్ పెరిగిపోతున్న కంటెంట్
ఒకప్పుడు 'A' సర్టిఫికెట్ రాకుండా జాగ్రత్త పడిన సినీ నిర్మాతలు, ఇప్పుడు కావాలని హింసను చూపించి 'A' సర్టిఫికెట్‌ను పొందుతున్నారు. భారతదేశంలోనే అత్యంత హింసాత్మక చిత్రం అని చెప్పుకోవడం ఒక దురదృష్టకర పరిస్థితి. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సెన్సార్‌షిప్ లేకపోవడంతో, అశ్లీలత, హింస విచ్చలవిడిగా ప్రదర్శితమవుతున్నాయి. పలు నివేదికల ప్రకారం, దేశంలో జరుగుతున్న అనేక నేరాలకు ఓటీటీ వెబ్ సిరీస్‌లు, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

సినిమాలను అనుకరించి నేరాలు
'ఎవడు' సినిమాను చూసి భర్తను చంపి, ప్లాస్టిక్ సర్జరీ చేయించి నమ్మించేందుకు ప్రయత్నించిన మహిళ కేసు, మలయాళ చిత్రం 'సూక్ష్మదర్శిని'ని చూసి భార్యను చంపి, ఆధారాలు లేకుండా చేసిన మీర్‌పేట గురుమూర్తి కేసు, 'దృశ్యం 2' చూసి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను హత్య చేయించిన సిద్దిపేట అల్లుడు కేసు - ఈ సంఘటనలన్నీ సినిమాల ప్రభావానికి ప్రత్యక్ష ఉదాహరణలు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో కూడా నిందితుడు అఫ్తాబ్ ఒక వెబ్ సిరీస్ చూసి శవాన్ని ముక్కలు చేసినట్లు అంగీకరించాడు.
కుటుంబంతో చూడలేని కంటెంట్
ఇటీవల వచ్చిన 'యానిమల్', 'కిల్', 'హిట్ 3' వంటి చిత్రాలలో, అలాగే 'మీర్జాపూర్', 'సైతాన్', 'రానా నాయుడు' వంటి వెబ్ సిరీస్‌లలో మితిమీరిన హింస, బూతులు ఉన్నాయి. ఈ కంటెంట్ ఇంట్లో అందరితో కలిసి చూసే పరిస్థితి లేదు. చిన్న పిల్లలు, యువత ఈ కంటెంట్‌ను చూసి తప్పుదోవ పడుతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే, కంటెంట్ క్రియేటర్స్‌లో బాధ్యత పెరగాలి. సమాజానికి మంచి సందేశం ఇచ్చే సినిమాలు రావాలి, అప్పుడే ఇలాంటి దుర్ఘటనలు తగ్గుముఖం పడతాయి.












Click it and Unblock the Notifications