బీజేపీ నేతలకు కవిత సవాల్: 'పాపం... మా నాన్న భోళా శంకరుడు'
హైదరాబాద్: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పథకాలేంటో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా తెలంగాణ బీజేపీ నేతలెవరికీ తెలియదని నిజామాబాద్ ఎంపీ కవిత ఎద్దేవా చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో వికలాంగులు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలుస్తూ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదని, అయితే కేసీఆర్ మాత్రం అలా కాదని, అడగకుండా చాలా చేశారని, ఆయనను ఏమడిగినా చేస్తారని అన్నారు. సీఎం కేసీఆర్ వికలాంగులకు 3 శాతం అదనపు రిజర్వేషన్ కల్పిస్తారని ఆమె చెప్పారు. వికలాంగుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ఆమె తెలిపారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఊరు దిబ్బ చందాన వ్యవహరిస్తోందని ఆమె అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో వికలాంగులు టీఆర్ఎస్‌కు మద్దతు పలకడం శుభపరిణామన్నారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగులపై వివక్ష చూపుతోందని మండిపడ్డారు. నిజామాబాద్‌లో వికలాంగులకు 3 శాతం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నట్లు ఆమె తెలిపారు.
సుగమ్య అభియాన్‌కు ప్రధాని మోడీ ఇచ్చింది సున్నా అని వ్యాఖ్యానించారు. సుగమ్య అభియాన్ కాస్త అగమ్య అభియాన్ అయిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల గురించి బీజేపీ నేతలకే సరిగా తెలియద్నారు. కానీ సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతోన్న ప్రతీ పథకం ప్రజలకు పూర్తి అవగాహన ఉందన్నారు.
తమ ప్రభుత్వం సదరం శిబిరాల్లో వికలాంగుల సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామన్నారు. వికలాంగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అధికారులను, టీఎస్‌పీఎస్సీ అధికారులను త్వరలో కలుస్తామన్నారు.












Click it and Unblock the Notifications