బరాబర్ అసెంబ్లీలో అడుగుపెడతాం: పొంగులేటికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కౌంటర్
ఖమ్మం జిల్లా రాజకీయాలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో హీటెక్కాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేసిన తర్వాత వచ్చే ఎన్నికలలో ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ నాయకుడిని కూడా ఎమ్మెల్యేను కానివ్వను అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలు ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం కాగా, తాజాగా ఈ వ్యాఖ్యలపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్పందించారు.
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వద్దిరాజు రవిచంద్ర పొంగులేటి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఏమీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొత్తు కాదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ నేతలు బరాబర్ అసెంబ్లీలో అడుగు పెడతారు అంటూ పేర్కొన్న ఆయన కెసిఆర్, కేటీఆర్ ఇచ్చిన అవకాశాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.

2018 అసెంబ్లీ ఎన్నికలను సొంత పార్టీ వాళ్ళనే ఓడించేందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుట్ర చేశాడని వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాజకీయ అజెండా, జెండా రెండు లేవని పార్టీతో ఆర్థికంగా లాభ పడిన వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. అమాయకులైన నలుగురు నాయకులను వెంటేసుకుని తిరుగుతున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో తిరిగేవారికి రాజకీయంగా అన్యాయం చేయడం తప్ప మిగిలేదేమీ ఉండదని వద్దిరాజు రవిచంద్ర ఎద్దేవా చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికలలో, ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిన వారిని ఓడించటానికి ఎన్నో కుయుక్తులు చేశారని, అయినా కేసీఆర్ ఓపికతో ఎదురు చూశారని పేర్కొన్నారు. కానీ పొంగులేటిలో మార్పు రాలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కెసిఆర్ ఇటుక, ఇటుక పేర్చి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని శక్తివంతంగా చేశారని, బిఆర్ఎస్ పార్టీని ఓడించడం ఎవరితరం కాదన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తామని వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications