Manda Krishna: సీఎం రేవంత్ రెడ్డిపై మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు..!
ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం డీఎస్సీ ద్వారా ఎంపిక అభ్యర్థులకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాదిగలకు వ్యతిరేకమని మంద కృష్ణ మండిపడ్డారు. సీఎంను మాదిగ సమాజం ఎప్పటికీ నమ్మదని విమర్శించారు. వర్గీకరణ చేయకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చారని.. ఇది మాదిగలకు అన్యాయం చేయడమేనని అన్నారు.
బీఆర్ఎస్ నిర్బంధ పాలనలాగానే రేవంత్ రెడ్డి పాలన ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను మభ్యపెట్టేందుకు యత్నిస్తుందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చి తప్పారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే మాదిగలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై బుధవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి రఅధికారులను ఆదేశించారు.

వర్గీకరణపై సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకెళ్లాలని స్పష్టం చేశారు. వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ 60 రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆగస్ట్ లో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్రాలకు అధికారం ఉందని తీర్పు చెప్పింది. ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 మెజారిటీతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును ప్రకటించింది.
సూప్రీం తీర్పుతో రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం వచ్చింది. దీంతో ఆయా ఆయా రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేయాలని ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోన్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications