mulugu politics: సీతక్క వర్సెస్ ఎమ్మెల్సీ పోచంపల్లి: పేలుతున్న మాటల తూటాలు!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలప్రచారంలో తీవ్ర విమర్శల వర్షం కొనసాగుతుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్న నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటూ ప్రత్యర్థుల గుట్టు బయట పెడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ములుగు నియోజకవర్గ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.
ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ బినామీ నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని సీతక్క ఆరోపించారు.ఓటర్లకు కల్తీసారా, దొంగనోట్లను పంచుతున్నారని ఎమ్మెల్యే సీతక్క ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు దుమారంగా మారాయి.

దీనికి తాజాగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ వేశారు. బినామీ అని నాపై ఎమ్మెల్యే సీతక్క ఆరోపణలు చేయడం బాధాకరం అని ఆయన పేర్కొన్నారు. తాను ఎవరికి బినామీని కాదని అవసరమైతే నార్కో అనాలసిస్ టెస్ట్ కు సిద్దమని అన్నారు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.
దొంగ నోట్లు పంచుతున్నారని, స్పిరిట్ తో మందు తయారు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుల పై ఆరోపించిన సీతక్క పై ఎక్సైజ్ అధికారులు, ఎలక్షన్ కమీషన్ అధికారులు సుమోటో గా కేసు నమోదు చేయాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ములుగు లో BRS లో గెలుస్తుందనే ఆమె మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
కర్ణాటక నుండి కోట్ల రూపాయలు తెచ్చి ఎన్నికలలో పంచేందుకు నియోజకవర్గంలో దాచిపెట్టి మాపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీతక్క ములుగు సెంటర్లో చర్చకు రావాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్లో సీతక్క చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. సీతక్క వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని అవమానించేలా ఉన్నాయి. కాబట్టి తక్షణం ఆమెపై ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications