హైజాక్ కుట్ర: శంషాబాద్ సహా మూడు విమానశ్రయాల్లో హైఅలర్ట్..
మొత్తం 23మంది వ్యక్తులు ఈ విమానాల హైజాక్ కుట్రకు ప్లాన్ చేసినట్లుగా వారి సంభాషణలో వెల్లడైనట్లుగా ఈమెయిల్ ద్వారా స్పష్టమైంది.
హైదరాబాద్: ఓ మహిళ పంపిన ఈమెయిల్ దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బందిని అలర్ట్ చేసింది. శంషాబాద్, చెన్నై, ముంబై విమానశ్రయాల్లో హైజాక్ కుట్ర జరగవచ్చునన్న ఈమెయిల్ సందేశంతో ఈ మూడు ఎయిర్ పోర్టుల్లో ప్రస్తుతం హైఅలర్ట్ కొనసాగుతోంది.
సాధారణంగా గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవాల సందర్బంగా ఏర్పాటు చేసే అత్యున్నత స్థాయి భద్రతా వలయాన్ని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాన్ని(సీఐఎస్ఎఫ్) ఏర్పాటు చేశారు. ఆరుగురు యువకులు ఈ హైజాక్ కుట్ర గురించి మాట్లాడుకుంటుండగా తాను విన్నానని గుర్తు తెలియని మహిళ ఆ ఈమెయిల్ లో పేర్కొంది.

మొత్తం 23మంది వ్యక్తులు ఈ విమానాల హైజాక్ కుట్రకు ప్లాన్ చేసినట్లుగా వారి సంభాషణలో వెల్లడైనట్లుగా ఈమెయిల్ ద్వారా స్పష్టమైంది. ఈమెయిల్ పంపించిన ఆ గుర్తు తెలియని మహిళను హైదరాబాద్ కు చెందిన మహిళగా పోలీసులు భావిస్తున్నారు. శనివారం రాత్రి ముంబై పోలీసులకు వచ్చిన ఈమెయిల్ తో హైజాక్ కుట్ర విషయం వెలుగుచూసింది,
కాగా, ఈమెయిల్ లో పేర్కొన్న హైజాక్ కుట్ర ఎంతవరకు వాస్తవమో తెలియదు గానీ ముందు జాగ్రత్త చర్యగా భద్రతా సిబ్బందిని అలర్ట్ చేశామని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ తెలిపారు. సదరు మహిళ సైతం 'ఇదెంత వరకు నిజమో నాకు తెలియదు గానీ దేశ పౌరురాలిగా సమాచారం చేరవేయడం నా బాధ్యత' అంటూ మహిళ తన ఈమెయిల్ లో వెల్లడించింది.
దీంతో ఆదివారం తెల్లవారుజాము నుంచే సీఐఎస్ఎఫ్ భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు మొదలుపెట్టాయి. దేశంలోని ఇతర విమానశ్రయాలను కూడా భద్రతా అధికారులు అప్రమత్తం చేశారు. అయితే భద్రతా చర్యల వల్ల విమాన రాకపోకలకు ఎలాంటి అవాంతరం ఉండదన్నారు. ప్రస్తుతం ఈమెయిల్ పంపించిన మహిళను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.












Click it and Unblock the Notifications