స్వీపర్ గా పనిచేసిన చోటే కౌన్సిలర్, బజ్జీల బండి నడిపిన సామాన్య మహిళలకు పట్టం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎక్కడ ఎవరు గెలిచారు? ఎందుకు గెలిచారు? అన్న చర్చ మాత్రమే కాదు, ఈ ఎన్నికలలో పోటీ చేసిన సామాన్యులకు సైతం ప్రజలు పట్టం కట్టిన తీరుపైన కూడా మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో రోడ్ల పక్కన బజ్జీల బండి నడుపుకునే వాళ్ళు, రోడ్లు ఊడ్చిన స్వీపర్ లను కూడా ప్రజలు ఆదరించడం ప్రతి ఒక్కరూ చెప్పుకునేలా చేస్తోంది.
మున్సిపల్ ఎన్నికలలో ఎవరికి వారే ప్రత్యేకం
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 116 పురపాలక సంఘాలకు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా ప్రతి పార్టీ తమదైన సంచలనాలను రికార్డు చేసింది. కరీంనగర్ కార్పొరేషన్ ను హస్తగతం చేసుకుని బిజెపి, మునిసిపాలిటీలలో 13 చోట్ల విజయకేతనం ఎగురవేసి బీఆర్ఎస్, ఇక రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సంపాదించి తనకే ప్రజా మద్దతు ఉందని చెప్పే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ ఎవరికి వారే తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

మున్సిపాలిటీలో స్వీపర్ పని చేసిన మహిళ కౌన్సిలర్
ఇదే సమయంలో అత్యంత సామాన్యులు ఈ ఎన్నికలలో కౌన్సిలర్లుగా విజయం సాధించడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొన్నిచోట్ల అయితే ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీకి చెందిన ఇంజమూరి వెంకటమ్మ 10 వ వార్డు నుండి బి ఆర్ ఎస్ తరఫున పోటీ చేసి 317 ఓట్లతో విజయం సాధించారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి మచ్చ వాణిపైన 10ఓట్ల తేడాతో విజయం సాధించారు.
స్వీపర్ గా పని చేసిన చోటే కౌన్సిలర్ గా
ఈమెకు ఒక ప్రత్యేకత ఉంది. నేరేడుచర్ల మున్సిపాలిటీలో గతంలో స్వీపర్ గా పని చేసింది వెంకటమ్మ. ఆమె ఇప్పుడు అదే మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా అడుగుపెడుతోంది. తాను పనిచేసిన మున్సిపాలిటీలోనే ప్రజలు తనకు కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వడం పైన వెంకటమ్మ హర్షం వ్యక్తం చేస్తుంది.
బజ్జీల బండి నడిపే మహిళకు పట్టం
ఇదిలా ఉంటే ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కూడా ఓ మహిళ అద్భుతమైన విజయాన్ని సాధించింది. గతంలో ఇళ్లల్లో పని చేసుకున్న నాగు బాయి, ప్రస్తుతం బజ్జీల బండి పెట్టి జీవనం గడుపుతుంది. ఈ ఎన్నికలలో ఆమె 19వ వార్డు నుండి బీఆర్ఎస్ టికెట్ పైన ఎన్నికల బరిలోకి దిగి 58 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బజ్జీలు అమ్ముకునే మహిళను కౌన్సిలర్ గా చేసిన ప్రజల పట్ల ఆమె కృతజ్ఞత వ్యక్తం చేస్తుంది.
సామాన్యులను కౌన్సిలర్ లు చేసిన ప్రజలు
ప్రజల అవసరాలను తీరుస్తూ పని చేస్తానని చెబుతోంది. సామాన్యులను ప్రజలు కౌన్సిలర్లుగా చేయడమే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని చెప్పడానికి నిదర్శనం. ఇక ఇదే ప్రజాస్వామ్య స్ఫూర్తి అన్ని ఎన్నికలలోను కొనసాగితే సామాన్యులు కూడా మేము సైతం అంటూ రాజకీయాలలో ముందుకు వస్తారు.












Click it and Unblock the Notifications